డెమాక్రసీ’ పదం వింటేనే భయం..భయం!

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అరాచకమైన, నియంతృత్వపోకడలతో కూడిన పాలనను అందిస్తున్నారనే ఆరోపణలు తొలినుంచి పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు, ఆయన అనుచర గణాలకు కూడా ‘డెమాక్రసీ’ అనే పదం వింటేనే వణుకు పుడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆ పదంతోనే వారిలో భయం పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఏ వాలంటీర్ల ద్వారా అయితే.. ఓటర్లలో మెజారిటీ వర్గాన్ని ప్రలోభపెట్టడం సాధ్యమవుతుందని వారు వ్యూహరచనల్లో మునిగితేలుతున్నారో.. సదరు వ్యవస్థ మీద ఈసీ నిషేధాజ్ఞలు విధించడం వారికి ఊపిరి ఆడనివ్వడం లేదు. అందుచేత, ఏ సిటిజన్ ఫోరమ్ ఫర్ డెమాక్రసీ సంస్థ అయితే.. ఈసీకి ఫిర్యాదు చేసి ఇలాంటి నిర్ణయానికి, నిషేధాజ్ఞకి కారణం అయినదో ఆ సంస్థ మీద విరుచుకుపడుతున్నారు.

సిటిజన్ ఫోరమ్ ఫర్ డెమాక్రసీ అనే సంస్థ- వాలంటీరు వ్యవస్థ  ద్వారా పెన్షన్లు పంపిణీ చేయిస్తూ ఉండడం వలన ఎన్నికలు గాడితప్పే ప్రమాదం ఉన్నదని, అరాచకం రాజ్యమేలుతుందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వాలంటీరు వ్యవస్థ తొలినుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎలా అంటకాగుతున్నదో.. వాలంటీర్లకు గతంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల్లో.. వాలంటీర్లు అంటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని బరితెగించి నాయకులు ఎలా అంటూ వచ్చారో.. అలాంటి వాలంటీర్ల ద్వారాపెన్షన్లు పంపితే ఎంత ప్రమాదకరమో వారు ఈసీకి చేసిన ఫిర్యాదులో వివరించారు. ఇప్పటికే వాలంటీర్ల పాత్ర గురించి అనేక ఫిర్యాదులు స్వీకరించి ఉన్న ఈసీ, తుది నిర్ణయం తీసుకుంది. అది మింగుడుపడని వైసీపీ నాయకులందరూ కలసి చంద్రబాబు మీద పడి ఏడుస్తున్నారు. సిటిజన్ ఫోరమ్ ఫర్ డెమాక్రసీ అనే సంస్థ.. చంద్రబాబు బినామీగా నడిపిస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు.

ఇలాంటి అక్రమ సంబంధాలను ముడిపెట్టి..  ఒక వ్యక్తికి, ఒక నాయకుడికి, ఒక సంస్థకు చెడ్డపేరు తీసుకురావడం పెద్ద కష్టం కాదు. అలాంటి బురదచల్లే పనిలో వైసీపీ నాయకులు సిద్ధహస్తులు కూడా. సాదారణంగా రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులకు తప్పుడు వ్యవహారాలతోనో, అక్రమాస్తులతోనో బినామీ పేర్లతో నడుపుతున్నారంటూ అంటగడుతుంటారు. కానీ.. వైసీపీ నాయకులు చిత్రంగా.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం నడుస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థను కూడా చంద్రబాబునాయుడుకు బినామీ సంస్థగా అభివర్ణించడమే తమాషా. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేసే సంస్థ చంద్రబాబు బినామీ అని చెప్పినా ఆయనకే ప్రజల్లో మంచి పేరు వస్తుందనే విషయం ఈ నాయకులు గుర్తిస్తున్నట్టు లేదు.

గతంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ సంస్థకు కార్యదర్శి. ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉండగా.. జగన్ అండ్ కో ఆయనను ఎన్ని రకాలుగా ముప్పతిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్లు తాగించిందో అందరికీ తెలుసు. ఆయన స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలంటే.. హైకోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవాల్సి వచ్చింది.

ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేసేస్తుందనే అభిప్రాయం  ఆయనకు అప్పుడే ఏర్పడిందో ఏమో గానీ.. ఆయన రిటైరైన తరువాత సిటిజన్ ఫోరం ఫర్ డెమాక్రసీని స్థాపించారు. ఆయన ఎన్నికల అధికారి పదవిలో ఉన్నంతకాలమూ ఆయనను వేధించిన వైసీపీ నాయకులంతా ఇప్పుడు ప్రజాస్వామ్యం కోసం ఏర్పాటైన ఈ సంస్థను కూడా సహించలేకపోతున్నారు. అందుకే ఇలాంటి చిల్లర విమర్శలు చేస్తున్నారని ప్రజలు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories