కొత్త అమరావతికి కూడా జై కొడుతున్న రైతులు

రాజధాని ప్రాంతంలో రెండో విడతగా సుమారు 44 వేల ఎకరాలు సమీకరించాలని అనుకుంటున్న ప్రభుత్వ సంకల్పానికి ప్రజల, రైతుల మద్దతు పుష్కలంగా లభిస్తోంది. ఈ భూసమీకరణకు తమ భూములు ఇవ్వడానికి పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మూడు గ్రామాల ప్రజలు తమ సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఆర్డీవో, సీఆర్డీయే అధికారులు కలిసి నిర్వహించిన గ్రామ సభల్లో రైతులు తమ భూములు ఇవ్వడానికి ఓకే చెప్పారు. భూముల విలువను మదింపు చేసే విషయంలో కొన్ని కోరికలు వ్యక్తంచేసి.. ప్రక్రియకు ముందే వాటిని అంగీకరించాలని కోరారు. ఈ నియోజకవర్గం పరిధిలో వైకుంఠపురం, యండ్రాయి, పెదమద్దూరు, కర్లపూడి గ్రామాల్లో 4824 మంది రైతుల నుంచి 9617 వేల ఎకరాల భూమిని సమీకరించబోతున్నారు.

అమరావతి నగర విస్తరణ కోసం కొత్తగా భూసమీకరణ వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో.. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రజలకు వివరించారు. కొత్తగా భూములను సమీకరించడం ద్వారా.. 16వేల ఎకరాల్లో దేశానికే స్పోర్ట్స్ రాజధానిగా అమరావతికి గుర్తింపు తెచ్చే అత్యద్భుతమైన స్పోర్ట్స్ సిటీని, అలాగే ఐదువేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక ఎయిర్ పోర్ట్ ను నిర్మించాలని చంద్రబాబునాయుడు సంకల్పించారు. అమరావతి అంటేనే విషం కక్కే జగన్ దళాలు.. ఈ కొత్త సంకల్పం గురించి సమాచారం బయటకు వచ్చిన క్షణం నుంచి ప్రజల్లో అపోహలను, అనుమానాలను వ్యాప్తి చేయడం ప్రారంభించారు. కొత్తగా సమీకరించే భూముల వలన.. అమరావతి ప్రాంతంలో తలపెట్టిన నిర్మాణాల్లో  ఆలస్యం జరుగుతుందని.. అక్కడ భూములు ఇచ్చిన వారికి దక్కే రిటర్నబుల్ ప్లాట్ల విలువ పడిపోతుందని రకరకాల అపోహలు ప్రచారం చేశారు.

అయితే ఇలాంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. రైతులనుంచి పూర్తి సహకారం ఉంటే మాత్రమే.. భూసమీకరణ చేస్తామని.. లేకపోతే భూసేకరణకు వెళతామని మంత్రి నారాయణ విస్పష్టంగా చెప్పారు. కాకపోతే.. సమీకరణ ద్వారా అయితే భూములు ఇచ్చిన రైతులకు ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉంటుందని ఆయన విపులంగా వివరించారు. ఎమ్మెల్యేల ద్వారా.. స్థానికుల అభిప్రాయాలు తెలుసుకున్న తరువాతే.. ముందుకు వెళతాం అని కూడా అన్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో పైగ్రామాల్లో గ్రామసభలు జరిగాయి. ఇక్కడ రైతులందరూ సుముఖత వ్యక్తం చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం ఆ తర్వాతి ప్రక్రియకు కసరత్తు ప్రారంభించింది. మొత్తానికి అమరావతి రాజధాని నిర్మాణానికి అడుగులు ప్రోత్సాహకరంగా పడుతున్నట్టుగానే.. రాజధాని విస్తరణకు భూసమీకరణ కూడా ఆశాజనకంగా సాగుతోందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories