‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అని సామెత! అధినేత ఎలాంటి పనిచేస్తుంటే, ఎలాంటి మార్గంలో నడుస్తుంటే తాము కూడా అదే అనుసరించాలని అంతా అనుకోవడం తప్పు కాదు.. ఆశ్చర్యకరం కాదు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అదే జరుగుతోంది. అధినేత జగన్మోహన్ రెడ్డి.. అబద్ధాలను వండి వారుస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తమ నాయకుడికి, అలాంటి అబద్ధాలే ఇష్టమేమో అని కార్యకర్తలు కూడా కొత్త అబద్ధాలను తయారుచేసి.. ప్రభుత్వం మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. తమ అబద్ధం బయటపడిన తర్వాత పరారవుతున్నారు. కానీ ఈలోగా వారి అబద్ధాలు బయటపడి.. వాటిని గమనించి.. ప్రజలు అసహ్యించుకుంటున్నారు. తమ పార్టీ వారి నుంచి అబద్ధాలను ప్రచారంలో పెట్టే, ప్రభుత్వాన్ని నిందించడం కోసం, బురద చల్లడం కోసం తప్పుడు ప్రచారాలు చేసే వారికి బ్రేకులు వేయకుంటే.. ఆయా కార్యకర్తలకు వచ్చే నష్టమేమీ లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు తప్పుడు పనులు చేసినా సరే.. ప్రజలు అసహ్యించుకునేది మాత్రం అధినేత జగన్మోహన్ రెడ్డినే అనే సంగతి ఆయన తెలుసుకోవాలి.
వివరాల్లోకి వెళితే..
సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం నార్సింపల్లిలో పాలయ్యగారి రమేశ్ అనే ప్రబుద్ధుడు ఉన్నాడు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్త గనుక.. కూటమి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేయాలనేది ఆయన తన ఎజెండాగా పెట్టుకున్నాడు. అందుకోసం తప్పుడు ప్రచారాలకు తెగబడ్డాడు. సినిమా మేకింగ్ లెవెల్ తెలివితేటలతో వీడియో తయారుచేశాడు. తన కుడిచేయి కనిపించుండా వెనక్కి పెట్టుకునిఆ పైన చొక్కా వేసుకుని.. తనకు ఒక చేయి లేదని, అయినా సరే.. తనకు వస్తున్న దివ్యాంగుల పెన్షనును అన్యాయంగా తొలగించారని ఒక తప్పుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
సహజంగానే.. ఈ వీడియో సంచలనం అయింది. దానికి తగ్గట్టుగా.. వైసీపీ సోషల్ మీడియా వాళ్లందరూ దీనికి భారీ ప్రచారం కల్పించారు. రమేశ్ సొంత గ్రామానికి చెందిన వారి దృష్టికి కూడా ఈ వైరల్ వీడియో వచ్చింది. వారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. రమేశ్ కు రెండుచేతులూ చక్కగా ఉన్నాయి. ఆ సంగతి తెలియజెప్పే పాత వీడియోలను ఆ గ్రామస్తులు బయటపెట్టారు.
వైఎస్సార్ కాంగ్రెస్.. రమేశ్ ద్వారా తప్పుడు వీడియోలతో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తున్నట్టుగా బయటపడింది. ప్రభుత్వం సీరియస్ కావడంతో.. తనకు అరదండాలు తప్పవని భయపడి రమేశ్ గ్రామంనుంచి పరారయ్యాడు.
ఈ ఒక్క ఉదంతం గమనిస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ తమ కార్యకర్తలతో డ్రామాలు చేయిస్తూ ఎంత నీచత్వానికి ఒడిగడుతున్నదో అందరికీ అర్థమవుతున్నది. తప్పుడు వీడియోలతో బురద చల్లడం, బండారం బయటపడితే.. పరారవడం వారి స్ట్రాటజీ అన్నమాట. తన పార్టీ వారు చేస్తున్న ఇలాంటి తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయకపోతే.. ప్రజలు అసహ్యించుకునేది మాత్రం జగన్మోహన్ రెడ్డినే! ఆయన ఈ సంగతి తెలుసుకోవాలి.