వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ లేకి బుద్ధులను మరోసారి ప్రదర్శించుకున్నారు. అడుగడుగునా ఫేక్ ప్రచారాలు అలవాటైపోయిన నాయకులు.. ప్రధాని వచ్చిన సందర్భాన్ని కూడా తమ ఫేక్ ప్రచారానికి వాడుకున్నారు. అదేదో చిల్లర వ్యవహారమూ, ఆషామాషీ సందర్భమూ కూడా కాదు. ఏకంగా దేశ ప్రధాని రాష్ట్రపర్యటనకు వచ్చిన సందర్భాన్ని కూడా తమ అబద్ధపు ప్రచారాలకు అవకాశంగా వాడుకోవడం ప్రజలకు వెగటుపుట్టిస్తోంది. ఇంతకూ ఏం జరిగిందంటే..
ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. కర్నూలు విమానాశ్రయం వద్ద స్వాగతం పలకడం వీడ్కోలు చెప్పడం వంటి సందర్భాల్లో ప్రోటోకాల్ ప్రకారం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు కూడా అవకాశం కల్పించారు. స్వాగతం, వీడ్కోలు వరకే వారు అందరితో పాటు వ్యవహరించారు. అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో తప్పుడు ప్రచారాలు హోరెత్తించారు. ప్రధానిని వైసీపీ నేతలు కలిసిన ఫోటోలను వాడుకుంటూ.. రాష్ట్రంలో పరిపాలన గురించి ఫిర్యాదులను ప్రధానికి సమర్పించినట్టుగా ఫేక్ ప్రచారానికి తెరతీశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలోకి ఇస్తుండడంపై ప్రెవేటీకరణ తగదని కోరుతున్నట్టుగా, వాల్మీకులను ఎస్టీల జాబితాలో చేర్చాలని కోరినట్టుగా ప్రధానికి వినతిపత్రాలు ఇచ్చినట్టు ప్రచారం చేసుకున్నారు. నిజానికి ప్రధానికి వారు ఎలాంటి వినతిపత్రం ఇవ్వడమూ జరగనేలేదు.
ఆ మాటకొస్తే రాష్ట్రంలో ఉన్నది ఎన్డీయే కూటమి ప్రభుత్వమే. ఏ విషయంలో అయితే.. మెడికల్ కాలేజీల ప్రెవేటీకరణ అంటూ బూటకపు మాయమాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారో.. సదరు వైద్య ఆరోగ్యశాఖను చూస్తున్నది భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రి సత్యకుమార్ కావడం గమనించాల్సిన సంగతి. ప్రెవేటీకరణ అంటూ వైసీపీ నేతలు చేస్తున్న అబద్ధాలను సత్యకుమార్ ఒక రేంజిలో ఖండిస్తున్నారు. మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ తమ వాదనతో ప్రధానికి వినతిపత్రం ఇవ్వడం అంటూ జరిగితే.. సత్యకుమార్ మీద, ఆయన పార్టీకి చెంది అధినాయకుడికి ఒక అబద్ధపు ఫిర్యాదును చేయడమే అవుతుంది.
అయితే.. వైసీపీ నేతలు ఇలాంటి అబద్ధపు ప్రచారాలకు దిగడం పట్ల కేంద్ర ఇంటెలిజెన్స్ దృష్టి సారించినట్టుగా వార్తలు వస్తున్నాయి. మోడీ పర్యటనను కూడా ఇలా ఫేక్ ప్రచారాలకు వాడుకోవడాన్ని సీరియస్ గా పరిగణిస్తూ, ఆమేరకు ప్రధానికి నివేదించనున్నట్టు సమాచారం.