భజనపరులకు మాత్రమే ముఖాముఖి ఎంట్రీనా?

ఎర్రగుంట్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అయిదేళ్ల పాటు అధికారంలో ఉంటూ.. ఊర్లలో తన వాహనశ్రేణి వెళుతూ ఉంటే చాలు.. రోడ్లకు రెండు పక్కలా దుకాణాలు మూయించేసి, పరదాలు కట్టించేసి తిరిగిన జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోంచి దిగిపోతున్న ప్రస్తుతతరుణంలో ఏ ఆలోచనతో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారనేది తెలియదు. ఎందుకంటే.. ముఖాముఖి అంటే ప్రజలు తమ ప్రభుత్వ అధినేతకు చెప్పుకునే కష్టాలను విని వాటిని పరిష్కరించే చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వాధినేత కాదు. కేవలం ఒక పార్టీ నాయకుడు. అధికారం చేతనుండగా ఎవరినీ పట్టించుకోకుండా, ఎవరి మొరలను ఆలకించకుండా.. ఇప్పుడు ముఖాముఖి అనే ప్రహసనం నడిపించారు జగన్.

ఇంతా కలిపి ఆ ముఖాముఖి కార్యక్రమానికి కేవలం భజనపరుల్ని  మాత్రమే అనుమతిస్తున్నారా? అనే అభిప్రాయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు కలుగుతోంది. ఎందుకంటే.. ముఖాముఖి కార్యక్రమానికి వెళ్లే ప్రజలను పోలీసులు, అధికారులు పూర్తిగా స్క్రీనింగ్ చేసి, వారి పార్టీ భావజాలాలను కూడా గమనించి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలురైన వ్యక్తులను మాత్రమే లోనికి అనుమతిస్తుండడం విశేషం. అంటే కేవలం జగన్ భజన చేసేవారిని, నువ్వు రాగానే మా బతుకులు బాగుపడియాయి అయ్యా.. నువ్విచ్చే డబ్బులతోనే బతుకుతున్నాం అయ్యా అని చెప్పుకునే బాపతు వాళ్లను మాత్రమే ఫుల్ ట్రెయినింగ్ ఇచ్చి మరీ లోనికి పంపుతారన్నమాట.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎర్రగుంట్ల ముఖాముఖి సందర్భంగా మరో విచిత్రం చోటు చేసుకుంది. అక్కడ ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వడానికి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రయి అక్కడకు వచ్చారు. నిజం చెప్పాలంటే..  ఆమెను అనుమతించి ఉంటే.. జగన్ హుందాతనానికి అది చిహ్నంగా ఉండేది. ఫ్యాక్షన్లకు నెలవైన జిల్లాలో అఖిలప్రియ బ్యాచ్ ను అనుమతించడం వల్ల ఘర్షణ చెలరేగుతుందనే భయం ఉంటే.. ఆమెను ఒక్కదానినీ వినతిపత్రం ఇవ్వడానికి పంపి ఉంటే పోలీసులు కూడా చాలా బాగా వ్యవహరించినట్టు ఉండేది. అయితే.. పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఆమెకు అనుమతి లేదని, లోనికి వెళ్లడానికి వీల్లేదని అన్నారు.

అఖిలప్రియ వర్గం ముఖాముఖికి వెళ్లేందుకు ప్రయత్నించిగా ఎమ్మెల్యే గంగుల నాని వర్గీయులు వాళ్లపై రాళ్లదాడికి దిగారు. ఘర్షణలు ముదురుతాయని భావించిన పోలీసులు అఖిలప్రియను అరెస్టు చేసి శిరివెళ్ల పోలీసుస్టేషనుకు పంపారు. మొత్తానికి జగన్ ముఖాముఖి అనే పేరు పెట్టి వినతిపత్రాలు స్వీకరించినా కూడా కేవలం పెయిడ్ కూలీల దగ్గరినుంచి మాత్రమే స్వీకరిస్తారని, కొత్తగా ఎవరినీ అనుమతించరని.. ప్రజలు అంటేనే, వారిని కలవడం అంటేనే ఆయన భయపడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories