ఓటుకు ఎక్స్‌ట్రా రేటు.. వైసీపీ ఎమ్మెల్యేలకే చేటు!

జగనన్న తాను చేసిన సంక్షేమ పథకాలు మాత్రమే పార్టీని గెలిపిస్తాయని ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ.. తన ప్రభుత్వం చేసిన సంక్షేమం ఫలితం మీ ఇంటి దాకా చేరి ఉంటే మాత్రమే నాకు ఓటు వేయండి లేకపోతే ఓటు వేయవద్దు అని పడికట్టు డైలాగులు వల్లించినప్పటికీ.. ఓటర్లకు డబ్బు పంచడం ద్వారా మాత్రమే గెలుస్తామనే నమ్మకం ఆ పార్టీ వారిలో ముందు నుంచి ఉంది. అందుకే ప్రత్యర్థి పార్టీ వారు ఊహించనంత పెద్ద మొత్తాలను ఓటర్ల ఓటుకు విలువ కట్టడం ద్వారా తాము నెగ్గాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆశించారు. నిజానికి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన నాయకులు కూడా అనివార్యంగా ఓటర్లకు డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందరూ డబ్బు పంచారు. అయితే తెలుగుదేశం వారు ఎంత డబ్బు పంచుతున్నారో అంతకు మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు పంచడం జరిగింది. ఇలాంటి ప్రయత్నం ఒక కోణంలోంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు చేటు చేసినట్టుగా క్షేత్రస్థాయి సమాచారం ద్వారా తెలుస్తోంది.

ఉదాహరణకు తిరుపతి ఎంపీ నియోజకవర్గ పరిధిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల వ్యవహారాలను గమనిద్దాం. శ్రీకాళహస్తి నియోజకవర్గం లో తెలుగుదేశం అభ్యర్థి సుధీర్ రెడ్డి ఓటుకు ₹2,000 వంతున పంచారు అని సమాచారం. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి ఓటుకు మూడువేల రూపాయల డబ్బు ఇవ్వడంతో పాటు బంగారు ముక్కుపుడక, తలా ఒక చీర తదితరాలన్నీ కలిపి 5000 రూపాయలు గిట్టుబాటు అయ్యేలా అందరికీ ఇచ్చారని సమాచారం.

అదే తరహాలో సత్యవేడు ఎస్సీ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి ఓటుకు ₹1000 పంచిపెట్టారు. అదే వైఎస్ఆర్సిపి విషయానికి వచ్చేసరికి ఓటుకి 1500 రూపాయల వంతున పంచిపెట్టారు. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా తెలుగుదేశం కంటే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులే ఎక్కువ మొత్తాలను పంచిపెట్టడం జరిగింది.

తమాషా ఏమిటంటే అభ్యర్థులు ఓటర్లలో ఎవరినీ వదులుకోకుండా తెలుగుదేశం వాళ్ళు డబ్బు ఇచ్చిన కుటుంబాలకు కూడా వైసిపి వారు డబ్బులు ఇచ్చారు. ప్రజలు కూడా ఒక పార్టీ దగ్గర మాత్రమే డబ్బులు తీసుకుంటే రెండో పార్టీ వారు తమను అనుమానిస్తారు, టార్గెట్ చేస్తారు అనే భయంతో ఇద్దరి వద్ద నుంచి ఇచ్చింది పుచ్చుకున్నారు. ఇద్దరి దగ్గర పుచ్చుకున్నాము కనుక ఇద్దరికీ న్యాయం చేయాలని ప్రజలు అనుకున్నారు.

ఓటింగ్ కేంద్రానికి వెళ్లే సమయానికి ఎక్కువ డబ్బులు ఇచ్చిన వైసిపి వారికి మొదటి ఓటు, తక్కువ డబ్బులు ఇచ్చిన తెలుగుదేశానికి రెండో ఓటు వేసి చేతులు దులుపుకున్నారు ప్రజలు. అయితే తమాషా ఏమిటంటే మొదటి ఓటు ఎంపీ కి పడుతుంది. రెండో ఓటు ఎమ్మెల్యేకు పడుతుంది. తెలుగుదేశం కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వడం వలన.. వైసీపీకి ఎక్కువ న్యాయం చేయాలని అనుకున్న ప్రజల ఓట్లన్నీ కూడా ఎంపీ విషయంలో వైసిపి అభ్యర్థి గురుమూర్తికే పడ్డాయి. ఎమ్మెల్యే విషయంలో తెలుగుదేశం అభ్యర్థులకు ఓట్లు పడ్డాయి. ఆ రకంగా అనుకోకుండానే బీభత్సమైన క్రాస్ ఓటింగ్ జరిగిందనేది స్థానికుల అంచనా! దానికి తగ్గట్లుగానే స్థానికులు అంచనాలను బట్టి తిరుపతి ఎంపీగా గురుమూర్తి మళ్ళీ నెగ్గుతారని.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఆ దామాషాలో నియోజకవర్గ పరిధిలో నెగ్గే అవకాశం లేదని కూడా వినిపిస్తోంది. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అధికార పార్టీ ఈ అతి ధరలు చెల్లించడం ద్వారా నష్టపోయిందో లాభపడిందో వేచి చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories