తాము చస్తే శృంగారం.. పరులుచేస్తే వ్యభిచారం అనేది చాలా పాపులర్ సామెత. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహార సరళి కూడా అచ్చంగా అలాగే కనిపిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తాము చేసే పనులన్నీ నిబంధనలకు లోబడి చేస్తున్నట్టే లెక్క.. కానీ అవే పనులు విపక్షాలకు చెందిన వారు చేస్తే మాత్రం.. నిబంధనలను అతిక్రమించినట్టు లెక్క! రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలు ఇప్పటికీ తమ చెప్పుచేతల్లోనే ఉండడంతో వారు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పోలీసులు అధికారులు వ్యవహరిస్తున్న తీరు గమనిస్తే ఇలాగే అనిపిస్తుంది.
కాకినాడ రూరల్ మండలంలోని తిమ్మాపురం గ్రామంలో బిజెపి నాయకుడు ధనరాజు ఇంట్లో ఎన్డీయే కూటమి నాయకులు సమావేశం అయ్యారు. మూడు పార్టీలకు చెందిన వారు హాజరయ్యారు. ‘ఇంట్లో’ జరిగిన సమావేశం అది. కానీ.. మొదలైన కాసేపటికి పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చేశారు. మీ సమావేశానికి అనుమతులు లేవు.. నిర్వహించడానికి వీల్లేదని అంటూ అడ్డుపడ్డారు. ఇంటిలోపల నిర్వహించుకునే సమావేశానికి కూడా అనుమతులేంటని నాయకులు ఎంతగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు పట్టించుకోలేదు.
వైసీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తన ఇంటి ఎదురుగా మునిసిపల్ స్థలంలో పందిరి వేసి మీటింగు పెట్టినా నోరు మెదపని పోలీసులు, ఇక్కడ పల్లెటూరిలో ఇంటి లోపల సమావేశం పెట్టుకుంటే మాత్రం అడ్డుకుంటున్నారని నాయకులు ఆరోపించారు.
ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఇదేమాదిరి పరిస్థితులు ఉన్నాయి. ఎన్డీయే కూటమికి చెందిన వారు ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, నిషేధాజ్ఞలు వర్తించని పనులు చేస్తున్నా సరే.. పోలీసులు అడ్డుకుంటున్నారు. కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారు.
కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న అధికారులు, పోలీసుల మీద ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం ఇంకా మొదలు కాలేదు. ఈసీ ఇప్పటిదాకా వాలంటీర్ల మీదనే కత్తి ఝుళిపించింది. ఇలాంటివివక్షకు సంబంధించి అందుతున్న ఇతర ఫిర్యాదులపై ఇంకా చర్యతీసుకునేదాకా పరిస్థితి రాలేదు. దాంతో అధికారులు రెచ్చిపోతున్నారు. ఒకసారి ఈసీ కొరడా ఝుళిపించిందంటే.. ఇలాంటి అరాచక పరిస్థితులన్నీ కూడా దార్లోకి వస్తాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు.