ఎవరైనా తమ లోపాలను చెప్పినప్పుడు వినకుండా, వాటి గురించి ఆలోచించకుండా.. ఉన్నత స్థానాలకు ఎదిగిన వ్యక్తి ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. లోపరహితంగా ఏ పనినైనా చేయడానికి మనుషులు దేవుళ్ళు కాదు. కానీ చేసిన తప్పులను వివరించే వారిని శత్రువులుగా పరిగణించడం, వారిని ద్వేషించడం, వారి మీద విషం కక్కడం సరైన పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి విమర్శలను సహించలేని నాయకుడు. విమర్శలు చేసే మీడియా మీద ఆయన నిత్యం నిప్పులు కక్కుతూ ఉంటారు. శత్రువులుగా పరిగణిస్తూ ఉంటారు. ఆ రకంగా ఆయన ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు, టీవీ5 వంటి న్యూస్ ఛానల్ లను శత్రువులుగా పరిగణించడం ఏనాడో ప్రారంభించారు. తమాషా ఏమిటంటే వారిని శత్రువులుగా ఎంచడం మాత్రమే కాదు. ఎవరు వచ్చి తనను విమర్శించినా సరే వారు ఆ సంస్థలకు చెందిన వారుగా పరిగణించడం కూడా అలవాటు చేసుకున్నారు. ఆయన కళ్ళకు వాస్తవాలు కనిపించడం లేదు. కేవలం శత్రువులు మాత్రమే కనిపిస్తూ ఉంటారు.
జగన్మోహన్ రెడ్డి – రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం కోసం వినుకొండకు వెళ్ళినప్పుడు ఆయనలోని ఈ బుద్ధి కూడా బయటపడింది. పరామర్శ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించిన జగన్ ఢిల్లీలో ధర్నా గురించి, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పడం గురించి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం గురించి తనకు తోచినదల్లా మాట్లాడారు. అంతకంటే కామెడీ ఏంటంటే రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తూ వారివద్ద అమ్మ ఒడి, విద్యా దీవెన, వంటి పథకాల గురించి ప్రస్తావించారు. పరామర్శకు వచ్చి ఇదేం సొంత డబ్బారా నాయనా అని చూస్తున్న వారు విస్తుపోయే పరిస్థితి. తీరా ప్రెస్ మీట్ సమయంలో ఒక విలేకరి రషీద్ కుటుంబానికి మీరు ఏం భరోసా ఇచ్చారు అని అడిగితే జగన్ కంగారు పడ్డారు.
‘మధ్యలో అడిగితే ఫ్లో పోతుంది కదాప్పా, ఎంతగా నువు ఆంధ్రజ్యోతి విలేకరి అయితే మాత్రం మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఎలాగా’ అని దెప్పిపొడిచారు. నిజానికి అడిగింది ఆంధ్రజ్యోతి విలేకరి కాదు. ఎవరు తనని ప్రశ్ని అడిగినా సరే, వాళ్ళని ఆంధ్రజ్యోతి ఈనాడు విలేఖరుల్లాగా చూడడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయిపోయినట్లుగా ఉంది. ఇంతాకలిపి ఆయన రషీద్ కుటుంబానికి ఇచ్చిన భరోసా ఏమీ లేదు. కేవలం మాటలు చెప్పి చంద్రబాబు ప్రభుత్వాన్ని నిందించి, ఢిల్లీలో ధర్నా చేస్తానని రంకెలు వేసి వచ్చేసారు. ప్రశ్న అడిగిన ప్రతి ఒక్కరిని శత్రువుగా పరిగణించే వైఖరిని కూడా ఆయనను బయట పెట్టుకున్నారు. ఇలాంటి వైఖరి తన ఎదుగుదలనే అడ్డుకుంటుందనే సంగతి ఆయన గ్రహిస్తే మంచిది.