వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మిగిలిఉన్న నాయకులందరికీ ఒకటే రూటుగా కనిపిస్తోంది. బయట ఉంటే.. దుడుకు వ్యాఖ్యలు, దుడుకు పనులు చేయడం.. ప్రభుత్వాన్ని పోలీసులను రెచ్చగొట్టేలా మాటలు రువ్వడం, నేరపూరితమైన ఉద్దేశాలతో దుడుకు పనులు చేయడం ప్రభుత్వాన్ని కవ్వించడం.. ఈ చర్యల్లో ఏ కారణంగానైనా సరే.. తమ మీద కేసులు నమోదుఅయితే.. పోలీసుల విచారణకు కూడా దొరక్కుంటా పరారు కావడం అనేదే.. వైసీపీ నాయకులకు ఇప్పుడు అలవాటైన మార్గంలాగా కనిపిస్తోంది. వివిధ కేసుల్లో అరెస్టు కావాల్సి ఉన్న, లేదా విచారణ ఎదుర్కోవాల్సి ఉన్న అనేక మంది వైసీపీ నాయకులు ఇప్పటికే పరారీలో ఉన్నారు. ఆ జాబితాలోకి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కూడా చేరిపోయారు. ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు ఇంటికి వెళ్లగా.. అప్పటికే ఆయన పరారయినట్టుగా గుర్తించారు. ఇప్పుడు ఆయన కూడా వేట మొదలైంది.
ఇంతకూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై కేసు ఏమిటి?
ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని పాపిరెడ్డి పల్లెలో మరణించిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన సంగతి అందరికీ తెలుసు. ఆ సందర్భంగా ఆయన వెంట తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కూడా ఉన్నారు. జగన్ కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద అనుకోని పరిణామాలు జరిగాయి. అసలు హెలిప్యాడ్ వద్దకు కార్యకర్తలను రానివ్వవద్దని పోలీసులు ముందునుంచి పార్టీ నాయకులు అందరికీ విన్నపాలు చేసినప్పటికీ.. పోలీసు నియమాలను నిబంధనలను ఉల్లంఘించడమే తమ లక్ష్యం అన్నట్టుగా అందరినీ హెలిప్యాడ్ వద్దకు తోలించారు. అక్కడ జనం రద్దీ ఎక్కువై తొక్కిసలాట కూడా జరిగింది. అంతే కాదు.. జగన్ ప్రయాణిచాల్సి ఉన్న హెలికాప్టర్ కొంత దెబ్బతింది. దీంతో జగన్ రోడ్డు మార్గాన బెంగుళూరు వెళ్లిపోయారు. ఆయన బయల్దేరిన వెంటనే.. హెలికాప్టర్ గాల్లోకి ఎగిరి అది కూడా బెంగుళూరు వెళ్లింది. అయితే అక్కడ జనాన్ని రెచ్చగొట్టి పోలీసుల మీదకు రాళ్లురువ్వేలా, అక్కడి పరిస్థితులు అదుపు తప్పేలా ప్రవర్తించారని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మీద కేసు నమోదు అయింది. జగన్ పాపిరెడ్డిపల్లి నుంచి పోలీసులను హెచ్చరిస్తూ అసభ్యంగా మాట్లాడగా.. హెలిప్యాడ్ వద్ద జగన్ కు భద్రత కల్పించలేకపోయారంటూ ఆ తర్వాత తోపుదుర్తి కూడా.. అవాకులు చెవాకులు పేలారు. మొత్తానికి పోలీసుల మీదికి జనాన్ని ఉసిగొల్పిన కేసు ఆయన మీద నమోదు అయింది.
తీరా అరెస్టు చేయడానికి పోలీసులు ఇంటికి వెళ్లగా.. అప్పటికే ఆయన పరారయ్యారు. ఇంట్లో ఆయన తండ్రి మాత్రం ఉండడాన్ని గమనించి పోలీసులు వెనుతిరగాల్సి వచ్చింది. అయితే తోపుదుర్తి పరారీలో ఉంటూ బెయిలు కోసం దరఖాస్తు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.