వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన, ప్రభుత్వంలోని పెద్దలు వేల కోట్ల రూపాయలు కాజేయడానికి అడ్డదారుల్లో సహకరించిన అధికారుల పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి అక్రమాల్లో కూడా హద్దులు దాటిన వారు అరెస్టులు అయ్యారు కూడా. జగన్ దళం అవినీతి పరుల్లో కూడా తిమింగలాలుగా గుర్తింపు పొందిన వారిలో ఆయన జమానాలో గనులశాఖకు డైరెక్టర్ గా పనిచేసిన వీజీ వెంకటరెడ్డి కూడా ఒకరు. ఇసుక అమ్మకాల్లో జగన్ దళాలు ఏకంగా 2566 కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడడంలో ఆయనకు కూడా భాగం ఉన్నదని, ఆయన మద్దతుతోనే జరిగిందనేది ఆరోపణ. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. 50 రోజుల రిమాండు తర్వాత ఆయనకు తాజాగా ఏసీబీ కోర్టు బెయిలు మంజూరు చేసింది. పోలీసుల విచారణలో వీజీ వెంకటరెడ్డి నిర్దిష్టంగా ఏవివరాలూ చెప్పలేదని, అసలు విచారణకు సహకరించలేదని ఆరోపణలున్నాయి. అయితే ఆయనకు ప్రస్తుతం బెయిలు వచ్చేసింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు తమ పరిపాలన కాలంలో రాష్ట్రంలోని వనరులను అడ్డగోలుగా దోచుకోవడానికి ఎంచుకున్న రెండు ప్రధాన మార్గాలు ఇసుక, లిక్కర్! ఈ రెండు విభాగాలు మొత్తం జగన్ వీరభక్తులతో నిండిపోయాయి. గనుల శాఖకు డైరెక్టర్ గా వీజీ వెంకటరెడ్డి పనిచేశారు. బినామీ కంపెనీలకు కాంట్రాక్టులు ఇవ్వడం, ఆ సంస్థలు ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడినా పట్టించుకోకపోవడం, వారు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకపోయినప్పటికీ వారు చూపించిన బ్యాంకు గ్యారంటీలను తిరిగి ఇచ్చేయడం వంటి అనేక అరాచకాలు వెంకటరెడ్డి చేతుల మీదుగానే జరిగాయి.
అరెస్టు తర్వాత పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించినప్పుడు.. వెంకటరెడ్డి జరిగిన అక్రమాలను ఒప్పుకున్నారు గానీ.. వాటికి కారకులు ఎవరు? అంతిమ లబ్ధిదారు ఎవరు? బాధ్యులు ఎవరు? సూత్రధారులు ఎవరు? అనే విషయాల్లో అసలు పెదవి విప్పలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏ ప్రశ్నలు అడిగినా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా వంటి సినిమాటిక్ సమాధానాలతో పోలీసులను విసిగించారని కూడా వార్తలు వచ్చాయి. అలాంటి వీజీ వెంకటరెడ్డికి ఇప్పుడు ఎంచక్కా బెయిలు లభించింది. ఇసుక కుంభకోణం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.