ఒక పోటీ జరుగుతున్నప్పుడు.. ఓడినవారు కూడా సంతోషించే, లేదా, అతిగా నిరాశపడని సందర్భం ఎక్కడైనా ఉంటుందా? సాధారణంగా ఉండదు కద! కానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వ పాలనలో అలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. టీచరు ఉద్యోగ నియామకాల విషయంలో, డీఎస్సీ ఎంపికల తుదిజాబితాలో స్థానం దక్కని వారిలో కూడా.. ఇప్పుడు నిరాశలేదు. దిగులు లేదు. ఇప్పుడు అవకాశం మిస్సయింది. కానీ.. నెక్ట్స్ టైం తప్పకుండా దక్కించుకుందాం.. అనే ఆత్మవిశ్వాసపు దోరణితోనే వారు ఈ వైఫల్యాన్ని స్వీకరిస్తున్నారు. ఇందుకు కారణం.. కేవలం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటన అనే చెప్పాలి.
డీఎస్సీ తుదిజాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఇందులో అవకాశం పొందలేకపోయిన ఎవ్వరూ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ఖాతా ద్వారా సందేశం ఇచ్చారు. తమ ప్రభుత్వం మాట ఇచ్చినట్టుగానే ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తుందని ఆయన ప్రకటించారు. పట్టుదలతో సిద్ధం కండి. వచ్చే ఏడాది మళ్లీ డీఎస్సీ వస్తుంది.. అంటూ, అవకాశం మిస్సయిన వాళ్లకు స్ఫూర్తి అందించారు నారా లోకేష్. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా.. ఇప్పుడు డీఎస్సీలో అవకాశం మిస్సయిన వాళ్లు ఏమాత్రం నిరాశచెందాల్సిన అవసరం లేదని.. కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామనే మాటకు కట్టుబడి ఉన్నదని పునరుద్ఘాటించారు.
అయిదేళ్లపాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధ్వంసక పరిపాలనను గమనించిన నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఇలాంటి మాట నాయకుల నోటినుంచి రావడం చాలా చిత్రంగా కనిపిస్తున్నదనే చెప్పాలి. ఉపాధ్యాయ వర్గం మీద కక్ష కట్టినట్టుగా తన పాలన కాలంలో జగన్ వ్యవహరించారు. వేలకొద్దీ ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా.. ఏదో కేంద్ర ప్రభుత్వ నిధులతో పాఠశాలల భవనాలను తయారుచేసే కాంట్రాక్టు పనులు మాత్రం చేయించి.. తానేదో విద్యారంగాన్ని ఉద్ధరించినట్టుగా జగన్ బిల్డప్పులు ఇచ్చుకున్నారు. అసలు టీచర్ల నియామకాల గురించి పట్టించుకోనేలేదు. నిరుద్యోగ ఉపాధ్యాయులనుంచి ఎన్ని వినతులు వెళ్లినా బుట్టదాఖలు చేశారు. ఎన్నికలకు ముందు.. డీఎస్సీ పేరుతో ఓ ప్రహసనం నడిపించాలని అనుకున్నారు గానీ.. వర్కవుట్ కాలేదు.
చంద్రబాబు సర్కారు.. డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల పట్ల తమ చిత్తశుద్ధిని ఘనంగా చాటుకుంది. అధికారంలోకి వచ్చినప్పుడే.. తొలిసంతకంగా మెగా డీఎస్సీ ఫైలుపై చేశారు. డీఎస్సీ పూర్తి ఎంపిక ప్రక్రియను 150 రోజుల్లో గాపూర్తిచేశారు కూడా. ఇప్పుడు నియామకాలు జరగబోతున్నాయి. అందుకే.. ప్రతి ఏటా డీఎస్సీ ఉంటుందని కూటమినేతలు చెబుతోంటే.. నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఆ మాటలు మరింత నమ్మకాన్ని, ఇంకా పట్టుదలగా సిద్ధం కావాలనే స్ఫూర్తిని అందిస్తున్నాయి.