సుప్రీం కూడా నిర్ఘాంతపోయిన వేళ..

జగన్మోహన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడడంకోసం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో.. ఆయన అనుచరులు, తొత్తులు, తైనాతీలు, దాసులు, బంట్లు రకరకాల కేటగిరీల వారందరూ నానా పాపాలకు  పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాపాలన్నీ ఒక్కటొక్కటిగా పండుతున్నాయి. ఒక్కరొక్కరుగా జైళ్లకు వెళుతున్నారు. నాయకులు, అధికారులు, భృత్యులు అనే తేడాలేం లేవు.. జగన్ కళ్లలో ఆనందం కోసం పాకులాడిన మోతాదును బట్టి.. అందరికీ జైలుప్రాప్తం అవుతోంది. అయితే అందులోనూ కొందరికి అనుకోని వరంలాగా బెయిళ్లు, ముందస్తు బెయిళ్లు కూడా లభిస్తున్నాయి. అయితే ఆ బెయిళ్ల బాగోతం కూడా సుప్రీం దాకా వెళ్లేసరికి ఉంటుందో పోతుందో అనే డైలమాలో పడుతోంది. తాజా పరిణామాలను గమనిస్తే.. జగన్ హయాంలో సీఐడీ చీఫ్ గా కూడా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ కు లభించిన ముందస్తు బెయిలు కూడా ప్రమాదంలో పడేట్టుగా కనిపిస్తోంది. అసలు ఈ ముందస్తు బెయిలు ఉత్తర్వులు వచ్చిన తీరును చూసి.. సుప్రీం కోర్టు నిర్ఘాంతపోవడం విశేషం.
జగన్ పాలన కాలంలో ఐపీఎస్ సంజయ్ సీఐడీ చీఫ్ గా కూడా సేవలందించారు. ఆ కాలంలో.. ఆయన జగన్ కు కిట్టని వాళ్లందరినీ ఒక రేంజిలో టార్చర్ పెట్టారు. ప్రధానంగా ఈనాడు రామోజీరావును వేధించడంలో కీలక పాత్ర పోషించారు. రామోజీరావు.. తీవ్ర అస్వస్థతతో ఇంట్లోనే బెడ్ పై ఉండగా.. అక్కడే ఆయనను విచారిస్తూ.. ఆ ఫోటోలను సాక్షికి లీక్ చేస్తూ నానా చండాలం చేశారు. రామోజీరావు మీద కక్ష కట్టిన జగన్ ఆనందం కోసం వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి, మార్గదర్శి సంస్థ ను బద్నాం చేయడానికి తమ శతవిధాల ప్రయత్నించారు. ఇంకా అనేక వ్యవహారాల్లో జగన్ కోరికల మేరకు అడ్డగోలుగా నిబంధనలను, చట్టాన్ని అతిక్రమించి సంజయ్ వ్యవహరించారు. ఇన్నిచేసినప్పటికీ కూడా.. రామోజీని సరిగా టార్గెట్ చేయలేదనే కోపంతో ఆయనను పక్కకు తప్పించారు జగన్.

అలాంటి సంజయ్ అగ్నిమాపకదళం డీజీగా ఉండగా పాల్పడిన అవినీతికి సంబంధించి కేసు నమోదు అయింది. హైకోర్టు గతంలో ఆయనకు ముందస్తు బెయిలు మంజూరుచేసింది. రాష్ట్రప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ముందస్తు బెయిలు తీర్పు ఇచ్చిన కాపీ ఏకంగా 49 పేజీలు ఉండడం చూసి సుప్రీం కోర్టు నిర్ఘాంతపోయింది. ముందస్తు బెయిలు పిటిషన్ విచారణ సమయంలోనే.. హైకోర్టు మొత్తం కేసు విచారణను, మినీ ట్రయల్ జరిపినట్టుగా ఉన్నదని సుప్రీం వ్యాఖ్యానించడం విశేషం.

అవినీతి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. ఆ ఆధారాలు పట్టించుకోకుండా హైకోర్టు బెయిలు ఇచ్చిందనేది రాష్ట్రప్రభుత్వం ఆరోపణ. అయితే ఈ కేసుకు సంబంధించిన అగ్రిమెంట్ కాపీ, ఇన్వాయిస్ లను సమర్పించాలంటూ కేసు వాయిదా వేసింది. కోర్టు అడిగిన కాపీలను సబ్మిట్ చేసిన తర్వాత.. వ్యవహారం అనుమానాస్పదంగా కనిపిస్తే.. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిలు రద్దయ్యే ప్రమాదం ఉంది. జగన్ కొమ్ముకాసినందుకు మరో ఐపీఎస్ అధికారి సంజయ్ కూడా జైలుకు వెళ్లే పరిస్థితి దాపురించవచ్చు. 

Related Posts

Comments

spot_img

Recent Stories