కడపజిల్లాలో ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానం కూడా తెలుగుదేశం పరమైంది. ఒక్క రౌండ్ కౌంటింగుతోనే.. పులివెందుల ఫలితం తేలిపోగా, ఒంటిమిట్ట మాత్రం ఓట్లు ఎక్కువ కావడంతో మూడు రౌండ్ల కౌంటింగ్ జరిగింది. ప్రతి రౌండ్ లోనూ వెనుకంజలోనే ఉన్న వైసీపీ అభ్యర్థి చివరికి పరాజయం పాలయ్యారు. తన సొంత జిల్లాలో జరిగిన రెండు జడ్పీటీసీ ఎన్నికలను కోల్పోవడం, తన సొంత మండలంలో జరిగిన ఎన్నికలో డిపాజిట్ కూడా దక్కకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి అహంకారానికి గొడ్డలిపెట్టు అని ప్రజలు భావిస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహుశా తన కనుల ముందు కప్పిన పొరలు ఈ పాటికి తొలగిపోయి ఉంటాయి. తన సొంత మండలంలోనే.. ప్రజలు తనను ఎంతగా ఛీత్కరించుకుంటున్నారో ఆయనకు అర్థమై ఉండాలి. నిజాయితీగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగితే.. ప్రజలు తనను కూడా ఓడిస్తారేమో అనే భయం ఆయనలో ఈ పాటికి మొదలై ఉండాలి. ఒకవేళ అలాంటి ఆత్మపరిశీలనకు దిగకుండా.. ఇంకా కూటమి ప్రభుత్వం మీద నిందలు వేస్తూ.. చంద్రబాబు చావును కోరుకుంటూ కొనసాగితే గనుక.. రాజకీయంగా భవిష్యత్తు లేకుండాపోతుందని ఆయన గ్రహించాలి.
కడపజిల్లాలో జరిగిన రెండు జడ్పీటీసీ స్థానాలను తెలుగుదేశం ఘనంగా గెలుచుకుంది. పులివెందులలో ప్రత్యర్థికి డిపాజిట్ కూడా దక్కనివ్వలేదు. ఒంటిమిట్ట విషయానికి వస్తే.. తెలుగుదేశం అబ్యర్థి ముద్దుకృష్ణారెడ్డికి 12,780 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి వైసీపీకి చెందిన ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6513 ఓట్లు వచ్చాయి. దీంతో ముద్దు కృష్ణారెడ్డి 6267 ఓట్లు మెజారిటీతో గెలుపొందినట్టుగా అధికారులు ప్రకటించారు.
రెండు నియోజకవర్గాల్లోనూ ఎన్నికల తీరును ప్రభావితం చేయడానికి ఇరు పార్టీల నాయకులు ప్రయత్నించారు. పులివెందుల విషయంలో తెలుగుదేశం ఎమ్మెల్సీ, వైసీపీ ఎంపీలను పోలీసులు అరెస్టు చేశారు. ఒంటిమిట్ట పరిధిలో ఇలాంటి అరెస్టులు జరగలేదు. అయితే తెలుగుదేశం మంత్రి రాంప్రసాదరెడ్డి, వైసీపీ మాజీ మంత్రి అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాధ రెడ్డి తదితరులు పోలింగు బూతుల వద్దకు వచ్చి హల్ చల్ చేయడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు చాలా పకడ్బందీగా వ్యవహరించి.. ఎన్నికలను పద్ధతిగా నిర్వహించారు.
జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి.. ఆయన వందిమాగధులైన వైసీపీ నాయకులందరూ కూడా గోలగోలగా ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నికల ప్రక్రియ మీద నిందలు వేస్తున్నారు. అయితే ప్రజలకు మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. రెండు నియోజకవర్గాల్లో కలిసి ఇంచుమించుగా 30 వేల ఓట్లు ఉండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ కు ఏడువేల ఓట్లు వచ్చాయి.
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. వైసీపీ నాయకులు తమ నిందల ద్వారా తమ ఆరోపణల మీద తామే అనుమానాలు పుట్టిస్తున్నారు. వారు చెప్పిన ప్రకారం.. వేల మంది తెదేపా కార్యకర్తల్ని ఇతర ప్రాంతాలనుంచి డంప్ చేశారు. ఎవ్వరూ స్థానికులు కాకపోయినా అన్ని ఓట్లూ వారే వేశారు. వైసీపీ పోలింగ్ ఏజంట్లను కూడా లోనికి రానివ్వకుండా రిగ్గింగు చేసుకున్నారు. ఇలా రకరకాలుగా చెప్పారు. ఇవన్నీ నిజమే అయితే గనుక.. వారి పార్టీకి ఒంటిమిట్టలో కూడా డిపాజిట్ దక్కి ఉండకూడదు. రెండు చోట్ల కలిపి ఏడువేల ఓట్లు వచ్చి ఉండకూడదు. అక్కడే వారి మాటలు అబద్ధాలు అని తేలిపోతున్నాయి. జగన్ వ్యవహార సరళి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా తగ్గని ఆయన అహంకారం.. ప్రజల్ని పట్టించుకోకపోవడం, చివరికి తాము గెలిపిస్తే అసెంబ్లీకి కూడా వెళ్లకుండా తన ప్రతిపక్ష నేత హోదాగురించి, తన సెక్యూరిటీ గురించి మాత్రమే హైకోర్టులో దావాలు వేసుకుంటూ కాలం గడుపుతూ ఉండడం ఇవన్నీ ప్రజలకు చిరాకు తెప్పించాయనడానికి నిదర్శనమే.. ఆయన మండలంలో పార్టీకి డిపాజిట్ దక్కకపోవడం. అందుకే ఈ తీర్పులు ఆయన అహంకారానికి గొడ్డలిపెట్టులు అని ప్రజలు నమ్ముతున్నారు.