తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఉద్యోగి సత్య వర్ధన్ కిడ్నాప్, బెదిరింపులు కేసులో ప్రస్తుతం అరెస్టు అయి రిమాండ్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సమర్ధించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్క మాట అదనంగా మాట్లాడినా కూడా వారి పరువు సమూలంగా నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ను వంశీ స్వయంగా దగ్గరుండి అనుచరుల సహకారంతో కిడ్నాప్ చేయించి తీసుకు వెళుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. లిఫ్టులో తీసిన ఈ వీడియోలో అటు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ- ఇటు వేధింపులు, ఒత్తిడిలు భరించలేక జడ్జి ఎదుట వాంగ్మూలాలు మార్చి చెప్పిన సత్యవర్ధన్ ఇద్దరూ కనిపిస్తున్నారు. వంశీ స్వయంగా సత్య వర్ధన్ ను కిడ్నాప్ చేయించి ఆ తర్వాత బెదిరించి తనుకు అనుకూలంగా మాటలు చెప్పించారనడానికి ఇది అతిపెద్ద రుజువు అన్నట్టుగా కనిపిస్తోంది. తెలుగుదేశం నాయకులు ఈ వీడియో విడుదల చేసిన తర్వాత.. ఇక వంశీకి మద్దతుగా.. ప్రభుత్వం కుట్ర చేసిందని.. వైసీపీ నాయకులు ఒక్క మాట మాట్లాడినా కూడా వారి పరువు పోయే పరిస్థితి ఏర్పడింది.
జైల్లో ఉన్న వంశీని పరామర్శించడానికి వైఎస్ జగన్ మంగళవారం వెళ్లారు. ఆ పరామర్శ కార్యక్రమాన్నే ఒక పెద్ద రోడ్ షో లాగా, భారీ ప్రదర్శన లాగా, భారీ బహిరంగ సభ లాగా నిర్వహించాలని ఆయన తపన పడ్డారు. ఇన్నాళ్లూ కలుగులో దాక్కున్న, సమాజం ఎదుటకు రావడానికి సిగ్గుపడుతూ ఇళ్లకు పరిమితం అయిన వైసీపీ నాయకులు అందరూ జగన్ వెంట నడవడానికి ఆరోజున కలిసి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పరామర్శలు పూర్తి చేసిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మీద నిందలు వేయడానికి ప్రయత్నించారు.
వంశీకి అనుకూలంగా సత్యవర్ధన్ చెప్పిన వాంగ్మూలాలన్నీ చాలా నిజాయితీతో చేసినవి, ఆ తర్వాత వంశీ అరెస్టు, కిడ్నాపు కేసు తరువాత.. చెప్పిన వాంగ్మూలాలు తెలుగుదేశం ఒత్తిడితో చెప్పినవి అన్నట్టుగా ప్రజలను నమ్మించడానికి జగన్మోహన్ రెడ్డి నానా పాట్లుపడ్డారు. సత్యవర్ధన్ ను బెదిరించి అతనితో ఫిర్యాదులు ఇప్పించినట్టుగా రంగు పూయడానికి ప్రయత్నించారు. అయితే జగన్ ఈ ప్రహసనం ముగించిన కొద్ది సేపటికే తెలుగుదేశం పార్టీ.. వల్లభనేని వంశీ స్వయంగా దగ్గరుండి తన అనుచరులతో సత్యవర్ధన్ ను కిడ్నాపు చేయించి తీసుకువెళుతున్న దృశ్యాలను వీడియోలుగా బయటపెట్టింది. దీంతో వైసీపీ నాయకులకు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టుగా అయింది. వారు ఎంతైనా అరచి గీ పెట్టవచ్చు గానీ.. వీడియో కూడా బయటకు వచ్చిన తర్వాత.. వంశీ శుద్ధపూస అంటూ ఇక ఒక్క మాట మాట్లాడినా కూడా వారి పరువే పోయే పరిస్థితి ఏర్పడిందని అంతా అనుకుంటున్నారు.