మంచు మనోజ్ కు కన్నతల్లి కూడా అండగా నిలవలేదే!

మంచుకుటుంబంలో ఇది సరికొత్త ట్విస్టు. తన తండ్రి మోహన్ బాబు దేవుడని, కానీ ఇప్పుడున్న మోహన్ బాబు తన తండ్రి కానే కాదని మంచు మనోజ్ నాటకీయమైన డైలాగులు చెబుతూ మీడియా దృష్టిని ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. తన కన్నతల్లిని చూసుకోవడానికి కూడా తనను అనుమతించలేదంటూ జాలిగొలిపే డైలాగులతో మీడియా ముందు పదేపదే మాట్లాడారు. ఆయన మాటలు ఎలాగైనా ఉండొచ్చు గానీ.. చివరికి కన్నతల్లి కూడా మంచు మనోజ్ కు మద్దతుగా మాట్లాడడం లేదు. మంచు మనోజ్ చేసిన ఆరోపణలు, చెప్పిన మాటలు అన్న అబద్ధాలంటూ మోహన్ బాబు భార్య నిర్మల స్వయంగా పహాడీ షరీఫ్ పోలీసులకు ఒక లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

తమ పెద్ద కుమారుడు విష్ణు జల్‌పల్లిలోని నివాసంలో గొడవ చేసినట్టుగా చిన్న కుమారుడు మనోజ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిజం లేదని నిర్మల అంటున్నారు. విష్ణు తన అనుచరులతో దౌర్జన్యంగా ఇంట్లోకి రాలేదని, ఎలాంటి గొడవ చేయలేదని ఆమె చెబుతున్నారు. డిసెంబరు 14న తన పుట్టినరోజు సందర్భంగా పెద్దకొడుకు విష్ణు జల్‌పల్లి ఇంటికి వచ్చి కేకు కట్ చేసి సంబరాలు చేశారు. దీనిపై నా చిన్న కొడుకు మనోజ్ లేనిపోని అభాండాలు వేశాడు. విష్ణు ఇంటికొచ్చి గొడవ చేసినట్టు సీసీ ఫుటేజీ బయటపెట్టాడు. అలాంటిదేం జరగలేదు అని నిర్మల అంటున్నారు. ఇంట్లో పనివాళ్లు మానేయడం వెనుక విష్ణుప్రమేయం లేదని కూడా ఆమె చెబుతున్నారు.

నిర్మల మోహన్ బాబుకు రెండో భార్య. మొదటి భార్య విద్య చనిపోయిన తర్వాత ఆమె చెల్లెలు నిర్మలను ఆయన వివాహం చేసుకున్నారు. మొదటి భార్య ద్వారా కలిగిన సంతానం లక్ష్మి, విష్ణు కాగా, నిర్మల ద్వారా మనోజ్ జన్మించారు. కుటుంబంలో ఆస్తి తగాదాలు ముదిరి మంచు కుటుంబం పరువు బజార్న పడిన సంగతి తెలిసిందే. కొన్ని వారాలుగా నానా రచ్చరచ్చ అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో వారి కుటుంబసభ్యులకు ఉండే లైసెన్సు గన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మంచు మనోజ్, విష్ణులను బైండ్ ఓవర్ చేయించారు. మోహన్ బాబు మీద విలేకరిపై చేసిన దాడికి సంబంధించి హత్యాయత్నం కేసు నమోదై ఉంది. ఇన్ని ట్విస్టుల మధ్యలో మంచు విష్ణు చేసిన తప్పు అసలేమీ లేనే లేదంటూ.. నిర్మల పూర్తి ఏకపక్షంగా పోలీసులకు లేఖ రాయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories