అంతిమక్షణాల్లో కూడా జగన్ సర్కార్‌కు మొట్టికాయ!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాను ఒకసారి పగబడితే చాలు.. అంతుచూసే వరకు వదిలే రకం కాదని, తనలో ఉన్న ఫ్యాక్షనిస్టు ధోరణిని బహుముఖంగా ప్రదర్శించుకోవడం ఈ అయిదేళ్లలో ప్రజలకు కొత్తేమీ కాదు! తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో కూడా అలాంటి పగబట్టిన ధోరణిని ప్రభుత్వం ఎంతబాగా ప్రదర్శిస్తున్నదో అందరూ చూస్తూనే ఉన్నారు. పోలింగ్ తర్వాత.. ప్రజల అంచనాల ప్రకారం.. జగన్ సర్కారు గద్దెదిగిపోబోతున్న అంతిమక్షణాలలో కూడా.. ఏబీ వెంకటేశ్వరరావు పట్ల తమ పగను నెగ్గించుకోవడానికి.. హైకోర్టుకు వెళ్లిన జగన్ సర్కారుకు అక్కడ మరో మొట్టికాయ తప్పలేదు. ప్రభుత్వానికి ప్రతికూలంగానే అక్కడ తాజాగా తీర్పు వచ్చింది.
రక్షణ పరికరాలు కొనడంలో అక్రమాలుచేశారనే ఆరోపణలతో జగన్ సర్కారు ఏబీ వెంకటేశ్వరరావును అధికారంలోకి వచ్చిన వెంటనే సస్పెండ్ చేసింది. ఆయన క్యాట్ ను ఆశ్రయించినా ఫలితం దక్కక, హైకోర్టుకు వెళ్లారు. అక్కడ సస్పెన్షన్ ను కొట్టేశారు. ప్రభుత్వం దాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లింది. అధికారిని రెండేళ్లకు మించి సస్పెన్షన్ లో ఉంచడానికి వీల్లేదని సుప్రీం తీర్పు రావడంతో.. ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇచ్చినా.. కొన్ని రోజులకే మళ్లీ అదే కారణాలతో మరోసారి సస్పెండ్ చేశారు.
ఒకే కారణంతో రెండు సార్లు సస్పెండ్ చేయడం తగదంటూ ఏబీ వెంకటేశ్వరరావు మళ్లీ క్యాట్ కు వెళ్లారు. క్యాట్ కూడా ఆ సస్పెన్షన్ ను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని, ఆ పీరియడ్ మొత్తానికి జీతభత్యాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలే పగబట్టి ఉన్న ప్రభుత్వం ఆ పనిని చేయకపోగా.. మళ్లీ రాష్ట్ర హైకోర్టులో ఇంకో పిటిషన్ వేసింది. క్యాట్ ఉత్తర్వుల్ని సస్పెండ్ చేయాలని కోరింది. అయితే సుదీర్ఘ విచారణల తర్వాత హైకోర్టు.. క్యాట్ ఉత్తర్వుల్ని రద్దు చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.
ఏబీ వెంకటేశ్వరరావు, ఈ నెల 31న పదవీవిరమణ చేయనున్నారు. రిటైర్ అయ్యేదాకా ఆయనకు ఎలాంటి పోస్టింగు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే జగన్ సర్కారు.. పోస్టింగు ఇవ్వకుండా ఆపింది. అయితే ప్రభుత్వమే 4వ తేదీనాటికి దిగిపోతుందని ప్రజలు అనుకుంటున్న తరుణంలో.. ఇది జగన్ నిర్ణయాలకు హైకోర్టు ద్వారా ఎదురైన మరో మొట్టికాయ అని ప్రజలు అనుకుంటున్నారు. జగన్ ప్రభుత్వం గద్దె ఎక్కిన నాటినుంచి.. ఆయన తీసుకున్న అనేకానేక నిర్ణయాలు.. హైకోర్టు తీర్పులతో వెనక్కు తీసుకోవాల్సి వచ్చిన సంగతి ప్రజలకు తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories