ముందస్తు బెయిలొచ్చినా.. జైలునుంచి విముక్తి లేదు!

అధికారం ఉన్నదనే అహంకారంతో చెలరేగిన రోజుల్లో కన్నూమిన్నూ గానకుండా ప్రవర్తించినప్పుడు. లెక్కలేనన్ని పాపాలకు పాల్పడుతూ పోయినప్పుడు.. ఫలితం ఇలాగే ఉంటుంది. ఆ పాపాలన్నీ ఒక్కసారిగా చుట్టుముడతాయి. ఒకదానిలో కాకపోతే మరొకదానిలో కాస్త ఊరట లభిస్తుంది. కానీ వెలుగు చూసిన మిగిలిన పాపాలు.. కట్టుబాట్ల మధ్యనే కట్టిపడేసి ఉంచుతాయి. విముక్తి, ఎప్పటిమాదిరి స్వేచ్ఛాజీవతం ఒక పట్టాన దొరకదు. అందుకోసం చాలా ప్రయాసపడాల్సి ఉంటుంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి ఇప్పుడు అచ్చంగా అలాగే ఉంది. తాజా పరిణామాల్లో ఆయనకు ఒక కేసులో ముందస్తు బెయిల్ రూపంలో ఊరట లభించినది గానీ, ఆయన జైలునుంచి బయటకు వచ్చే యోగం మాత్రం లేదు. వేరే రెండు కేసుల్లో ఆయన రిమాండు ఖైదీగా ఉంటున్నారు.
గన్నవరం నియోజకవర్గం పరిధిలో 8 ఎకరాల భూకబ్జా కేసులో హైకోర్టు రేవంత్ రెడ్డికి ముందస్తు బెయిలు మంజూరు చేసింది. బెదిరింపుల ద్వారా.. కోట్ల విలువ చేసే తన 8 ఎకరాల భూమిని కబ్జా చేసినట్టుగా ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రెండు కేసుల్లో అరెస్టు అయిన వల్లభనేని వంశీ.. ఏదో ఒకనాటికి ఆ కేసుల్లో రిమాండు నుంచి బయటకు వచ్చే సమయానికి, ఈ కబ్జా కేసులో అరెస్టు చేస్తారేమోనని ఆందోళన చెందారు. అందుకే ఈ కేసులో కూడా ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు బెయిలు లభించింది కూడా!  ముందస్తు బెయిలు వచ్చింది గానీ.. ఆయన ఇప్పట్లో జైలునుంచి బయటకు వచ్చే అవకాశం మాత్రం కనిపించడం లేదు.

గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద కుట్రపూరితంగా అనుచరులతో దాడిచేయించిన కేసులోను, ఆ దాడి కేసును పక్కదారి పట్టించడానికి, దళితయువకుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి నిర్బంధించిన కేసులోను ఆయన  ఇప్పుడు రిమాండు ఖైదీగా గడుపుతున్నారు. ఈ రెండు కేసుల్లోనూ పలుమార్లు ఇప్పటికే బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు గానీ.. కోర్టు తిరస్కరించింది.

గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీసు మీద దాడి ఒక్కటే కేసు అయితే.. బహుశా ఈ పాటికి బెయిలు కూడా దొరికి ఉండేదేమో. కానీ అతి తెలివితేటలకు వెళ్లి.. ఆ కేసులో తిమ్మిని బమ్మిని చేద్దామని ఆలోచించిన వంశీ, కేసు పెట్టిన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి, అతనితో ఎస్సీ ఎస్టీ కోర్టులో తప్పుడు వాంగ్మూలం ఇప్పించారు. ఆ కుట్ర మొత్తం సాక్ష్యాలతో సహా బయటపడిపోయింది. ముందుగా ఆ కిడ్నాపు కేసులోనే ఆయన అరెస్టు అయ్యారు. ఇలాంటి కుట్ర చేయడం వలన.. ఆయన జైలులో కాకుండా బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేయడానికి కుట్రలు చేస్తుంటారనే పోలీసుల వాదనకు హైకోర్టుఎదుట బలం చేకూరినట్లు అయింది. దాంతో కిడ్నాప్ కేసులోగానీ, దాడి కేసులో కూడా ఇప్పట్లో బెయిలు రావడం కష్టం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారంతో కళ్లు మూసుకుపోయి లెక్కకు అందనన్ని తప్పులు చేసినప్పుడు.. ఒకటి కాకపోతే మరొకటి ఎప్పటికీ జైలులోనే ఉంచేస్తాయని ప్రజలు అంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories