మిథున్ అయినా బురదే.. అంటిచుకోరాదు!

ఇప్పటిదాకా లిక్కర్ కుంభకోణంలో అరెస్టు అయిన తన అనుచరులు, ఆత్మీయులు ఏ ఒక్కరినీ పరామర్శించడానికి జైలుకు ములాఖత్ కు వెళ్లని జగన్మోహన్ రెడ్డి.. అలా పరామర్శిస్తే గనుక.. వారికి అనుకూలంగా తాను బహిరంగంగా మాట్లాడాల్సి వస్తుందని.. లిక్కర్ కుంభకోణంతో తనకు అంటగట్టి నిందలు వేయడం ఇంకా సులభం అవుతుందని భయపడుతున్నారు. ఇన్నాళ్లకు ఎంతో దగ్గరివాడు, తన దందాలకు కీలక వ్యూహకర్త అయిన మిథున్ రెడ్డిని కలవడానికి ములాఖత్ డిసైడ్ అయ్యారు గానీ.. ఈలోగా ఆయన ఆలోచన మారిపోయింది. మిథున్ అయినా సరే.. వెళ్లి కలవడం అంటే తన ఒంటికి బురద పూసుకోవడమే అవుతుందని.. వెళ్లకపోవడమే మంచిదని డిసైడ్ అయినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

మూడున్నర వేల కోట్లరూపాయల ముడుపుల సొమ్మును జగన్ అండ్ కో కాజేసిన లిక్కర్ కుంభకోణం రాష్ట్ర రాజకీయాలలో సృష్టిస్తున్న ప్రకంపనలు రోజురోజుకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. జగన్ గానీ,  ఆయన అనుచర గణాలు గానీ.. తొలినుంచి ఒకటే మాట అంటున్నాయి. లిక్కర్ కుంభకోణం అనేది అసలు లేనేలేదు. లేని కుంభకోణం గురించి కేసు పెట్టి.. రాజకీయ కక్షతో మావారినందరినీ అరెస్టులు చేశారు అని అంటున్నారు. తొలుత సాక్షిగా విచారణకు  హాజరైనప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి ఇదే కహానీ వినిపించారు. ఆ తర్వాత జగన్, సజ్జల సహా అందరూ అదే పాట పాడడం ప్రారంభించారు. ఒకవైపు డిస్టిలరీ యజమానులనుంచి అందుతున్న ఆధారాలు, బ్యాంకు ఖాతాల సాక్షిగా  సిట్ రాబడుతున్న వివరాలు అన్నీ.. జగన్ దళం చేసిన దారుణమైన దోపిడీని చాటి చెబుతున్నప్పటికీ.. వారు మాత్రం తాము చెప్పిందే వేదం అన్నట్టుగా సాగుతూ వచ్చారు. పదిమందికి పైగా ఈ కేసులో జగన్ కళ్లలో ఆనందం చూడడానికి దోపిడీ చేసిన భృత్యులు అరెస్టు అయినా ఆయన పట్టించుకోలేదు.

ఈ కేసులో తొలి రాజకీయ నాయకుడిగా జగన్ కు ఎంతో దగ్గరివాడు నమ్మకస్తుడు అయిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి అరెస్టు అయినప్పటికీ.. జగన్ ఖండించారే తప్ప కనీసం ములాఖత్ కు వెళ్లలేదు. కానీ.. లిక్కర్ కుంభకోణంలో జగన్ తర్వాత.. అంతే కీలకమైన వాటాలను పుచ్చుకున్న నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అయిన తర్వాత.. ఆయన మెత్తబడ్డారు. పైగా జగన్ దూతలుగా మిథున్ ని వెళ్లి కలిసిన వారి వద్ద, మిథున్, జగన్ రాకపోవడం పట్ల తన అసంతృప్తిని వెలిబుచ్చడంతో జగన్ 25న ములాఖత్ డేట్ తీసుకున్నారు. కానీ తాజాగా రద్దు చేసుకున్నారు. ఇప్పటిదాకా లిక్కర్ కుంభకోణంలో  ఒక్క నిందితుడిని కూడా ఆయన కలవలేదు. కలవకుండా ఉంటే.. తాను పరిశుద్ధుడినని అందరూ అనుకుంటారనే భ్రమలో జగన్ ఉన్నారేమో తెలియదు. కానీ.. మిథున్ ని కూడా కలవకుండా ఆయన తప్పు చేశారనే అభిప్రాయం పార్టీలో సర్వత్రా వ్యక్తం అవుతోంది. మిథున్ ని కలిస్తే కూడా తనకు బురద అంటుకుంటుందని జగన్ భయపడడం పార్టీ వారికే నచ్చడం లేదు.

Related Posts

Comments

spot_img

Recent Stories