ప్రభుత్వం మారినా పెద్దిరెడ్డి దందాలు సేమ్ టు సేమ్!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయన నెంబర్ టూ. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పెత్తందారీ ధోరణులతో అయితే చెలరేగుతారో, ఆయన అంతకు మించి వ్యవహరిస్తారు. తనకు తిరుగులేదన్నట్లుగానే ఐదేళ్లపాటు ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. అధికార దురహంకారంతో చెలరేగిపోయిన వారిని ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా సరే ఆయన పెత్తందారీ పోకడలకు మాత్రం తిరుగు లేకుండా ఉంది. అధికారులు ఆయన జోలికి వెళ్లడానికి భయపడతారు, సరి కదా హైకోర్టు చెప్పినా కూడా తనకు ఖాతరులేదని తాను తలచిందే చేస్తానని ఆయన నిరూపిస్తున్నారు. ఆయన పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన తీరు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినదే.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో తమ అధికారంలో ఉన్న రోజుల్లో తిరుపతిలోని తన ఇంటి ముందుగా మునిసిపల్ కార్పొరేషన్ డబ్బులతో సిసి రోడ్డు వేయించుకున్నారు. 2019-20 లో తొమ్మిదిన్నర లక్షల రూపాయల ఖర్చుతో ఈ రోడ్డు వేయడం జరిగింది. రోడ్డు పూర్తయ్యాక దానికి రెండు వైపులా పెద్ద పెద్ద ఇనుప గేట్లు పెట్టించి పెద్దిరెడ్డి వాటికి తాళాలు వేయించారు. మునిసిపాలిటీ వేసిన రోడ్డు మీద సామాన్య ప్రజలు ఎవరూ తిరగకుండా నిషేధం విధించారు. అయితే ఈ అరాచకత్వానికి వ్యతిరేకంగా జనసేన నాయకులు కిరణ్ రాయల్ తదితరులు ఆందోళన చేసి గేట్లను తొలగించే ప్రయత్నం చేయగా గతంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. 48 గంటల్లోగా చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ అధికారులు వారికి హామీ ఇచ్చారు.

అయితే ఈలోగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- తన భూమిలోని రహదారితో పాటు గేట్లను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ హైకోర్టుకు వెళ్లారు. కోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చింది. నిజానికి అది ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన రోడ్డు. ఆయన సొంత రోడ్డు కాదు. తాము రోడ్డుని ఎక్కడ ధ్వంసం చేయలేదని గేట్లను తీసివేయడం లేదని, కేవలం ప్రజల రాకపోకలు కనుగుణంగా చర్యలు చేపడుతున్నామని కార్పొరేషన్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. దీంతో రహదారిపై ప్రజలు రాకపోకలు సాగించేలా గేట్లు తొలగించాలని కోర్టు ఆదేశించింది. అధికారులు గేట్లు తెరిచారు. అయితే పెద్దిరెడ్డి ఇంటిదాకా వచ్చాక అక్కడ కొత్తగా మరొక గేటు ఏర్పాటు చేయడంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. ఆ రోడ్లో ప్రజలు ఎవరూ తిరగడానికి వీలు లేకుండా పోతోంది. ప్రభుత్వం మారినా సరే పెద్దిరెడ్డి దందా యధావిధిగా కొనసాగుతోందని, ఆయనను అడ్డుకోగలిగే వారు ఎవరూ లేరని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories