సాధారణంగా ఎవరైనా జైలుకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడితే సిగ్గుపడతారు. అవమానభారంతో కృంగిపోతారు. జైలు నుంచి బయటపడిన తర్వాత అదే అవమానభారంతో గుర్తు చప్పుడు కాకుండా ఇల్లు చేరుకుని.. కొన్నాళ్లపాటు ఇల్లు కదలకుండా ఉండిపోతారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు వేరు. ఎంత ఘోరమైన పోలీసు కేసులలో ఇరుక్కున్నప్పటికీ.. బెయిల్ మీద బయటకు వచ్చిన సందర్భాలలో కూడా ఆ పార్టీ నాయకులు ఒక పెద్ద ఊరేగింపు తీసి పూలమాలలు వేయించుకుంటూ, డప్పులు కొట్టించుకుంటూ ఆర్భాటంగా ఇల్లు చేరుకుంటారు. నాయకులందరిదీ ఒక తీరు అయితే అధినాయకుడికి సమానంగా వ్యవహరించే సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకాస్త వెరైటీగా ఉండాలి కదా. అందుకే ఆయన విడుదలయ్యే దాకా ఊరేగింపుల కోసం ఆగడం లేదు. పోలీసులు విచారణకు పిలిచినప్పుడు పార్టీ నాయకులందరినీ, అనుచరులు అందరినీ వెంటబెట్టుకుని పెద్ద ఊరేగింపు లాగా అక్కడికి వెళుతున్నారు . ఇలాంటి ఆర్భాటాలు చూసి ప్రజలు నవ్వుతారనే భయం కూడా ఆయనకు ఉండడం లేదు.
తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిన కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిని విచారించడానికి పోలీసులు పిలిచారు. అదే రోజున దేవినేని అవినాష్ ను కూడా విచారణకు పిలిచారు. వారిద్దరూ ఒకరిద్దరు అనుచరుల సహా అక్కడికి వచ్చి ఉంటే కొంచెం పద్ధతిగా ఉండేది. కానీ సజ్జల సిఐడి కార్యాలయానికి వచ్చిన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు, విడదల రజిని, అన్నా బత్తుల శివకుమార్, లేళ్ల అప్పిరెడ్డి, అంబటి మురళి వారి వారి అనుచరులు సహా గుంపులుగా అక్కడికి చేరుకున్నారు. అంతా కలిసి ప్రదర్శనలాగా సిఐడి కార్యాలయానికి వచ్చినప్పటికీ పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. వైసీపీ పార్టీ మీద జగన్ తర్వాత.. అంతటి తిరుగులేని పెత్తనం సాగిస్తున్న సజ్జల గుడ్ లుక్స్ లో పడడానికి ఈ నాయకులంతా ఆరాటపడుతున్నట్టుగా కనిపిస్తోంది.
విచారణలో సజ్జల ఎప్పటిలాగానే తెలియదు.. గుర్తులేదు.. తనకు సంబంధం లేదు.. పోలీసులు అడిగిన ప్రశ్న తన పరిధిలోనిది కాదు.. అనే విచిత్రమైన సమాధానాలను మాత్రమే చెప్పారు. దేవినేని అవినాష్ కూడా దాడిలో పాల్గొన్న వారు తన అనుచరులు కాదని బుకాయించే ప్రయత్నం చేశారు. అనుచరులతో కలిసి ఆయనే దిగిన ఫోటోలను చూపించినప్పుడు.. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నిత్యం తనతో ఎంతోమంది ఫోటోలు దిగుతుంటారని.. వారందరినీ అనుచరులుగా భావించడం కుదరదని దేవినేని అవినాష్ దబాయించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఏ కేసులలో ఎప్పుడు విచారణకు పిలిచిన సరే ఒకే తరహా సమాధానాలు చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తుంది. తెలియదు గుర్తులేదు వాటి సమాధానాలతో ఎన్ని సంవత్సరాలు వీలైతే అంతకాలం పాటు రోజులు నెట్టుకుంటూ పోవాలని స్థిరమైన నిర్ణయంతో వారు వ్యవహరిస్తున్నట్లుగా ఆ ప్రజలు భావిస్తున్నారు.