ఒక కోణంలో గమనించినప్పుడు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఎన్నికలు జరగడం ఒక ఎత్తు.. ఒక్క కడపలో జరిగిన ఎన్నిక మాత్రం మరో ఎత్తు. ఎందుకంటే- కేవలం గెలుపోటములు, అధికారం కోసం జరిగిన ఎన్నికలు కావు ఇవి. కేవలం అన్నాచెల్లెళ్ల మధ్య పోరాటంలాగా సాగినందుకు మాత్రమే కాదు.. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వం కోసం జరిగిన ఎన్నికలు! ఆయన తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి ని హత్య చేసింది ఎవరు అనే సంగతి తేల్చడానికి జరిగిన ఎన్నికలు! హత్యారాజకీయాల విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆరోపణలకు జవాబు ఇచ్చే ఎన్నికలు ఇవి.
కడప పార్లమెంటు స్థానం పరిధిలోనే జగన్ పోటీచేస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లోంచి విరమించుకున్న తర్వాత ఏపీసీసీ సారథిగా బాధ్యతలు తీసుకున్న షర్మిల తండ్రి వైఎస్సార్ వారసురాలిగా కడప ఎంపీగా గెలవడానికి ఇక్కడ బరిలోకి దిగారు. తాను కడప ఎంపీ కావడమే.. తన చిన్నాన వైఎస్ వివేకానందరెడ్డి కోరిక అని కూడా ఆమె ప్రకటించారు. అంతమాత్రమే కాదు.. కేవలం తనను వైసీపీ తరఫున కడప ఎంపీ చేయాలని పట్టుబట్టినందుకే.. చిన్నాన్నను అవినాష్ రెడ్డి హత్యచేయించి అడ్డు తొలగించుకున్నారని కూడా ఆమె ప్రకటించారు. అలాంటి హంతకుడు అవినాష్ రెడ్డిని రెండోసారి మళ్లీ పార్లమెంటుకు పంపడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఆమె ఎన్నికల ప్రచారం వందశాతం చిన్నాన్న హత్య చుట్టూ మాత్రమే తిరిగింది. ఆమె ప్రశ్నలకు అవినాష్ రెడ్డి గానీ, జగన్ గానీ సూటిగా జవాబు చెప్పలేకపోయారు. తన చెల్లెళ్లను చంద్రబాబునాయుడే ప్రోత్సహించి తన మీద ఆరోపణలు చేసేలా ఉసిగొల్పుతున్నారని, ఆయన పాచిక పారదని అనడం మినహా జగన్ మరేం చేయలేకపోయారు. ఇప్పుడు ఎన్నిక ముగిసింది. షర్మిల గెలుస్తుందా? లేదా? అనేది వేరే సంగతి. కడప ఎంపీ పరిధిలోను, పులివెందుల ఎమ్మెల్యే పరిధిలోను వైసీపీకి, జగన్ కు మెజారిటీ ఎంత వస్తుందనేది కీలకంగా మారింది? 2019 ఎన్నికల్లో సాధించిన మెజారిటీ కంటె ఒక్క ఓటు తగ్గినా కూడా.. వివేకాను అవినాష్ రెడ్డి హత్య చేయించాడనే ప్రచారాన్ని, అవినాష్ ను జగన్ ప్రోత్సహిస్తున్నాడనే ప్రచారాన్ని కడప నియోజకవర్గ ప్రజలు నమ్మినట్టుగానే అనుకోవాలి. కాబట్టి కడపలో జగన్ మెజారిటీలు ఎలా ఉండబోతున్నాయనే విషయంలో ప్రజల్లో చర్చోపచర్చలు నడుస్తున్నాయి.