పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు చెందిన మహిళలైనా సరే.. సరిహద్దుల దాకా వారి బస్సుల్లో వచ్చి.. అక్కడినుంచి ఏపీ ఆర్టీసీ బస్సు ఎక్కి ఎంచక్కా ఉచితంగా ప్రయాణించేయవచ్చా? ఫరెగ్జాంపుల్ బెంగుళూరు చెల్లెమ్మ ఎవరైనా.. కుప్పం దాకా వచ్చి.. కుప్పంలో బస్సు ఎక్కి ఉచితంగా ప్రయాణించి.. సింహాచలం దాకా వెళ్లి అప్పన్నస్వామిని సేవించుకుని, ఆ తర్వాత ఖాళీ ఉంటే.. ఉచిత ప్రయాణంతో శ్రీకూర్మ కూడా దర్శించుకుని.. అంతే హేపీగా తిరిగి బెంగుళూరు వెళ్లిపోగలుగుతుందా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే అవకాశం కల్పిస్తున్న కూటమి సర్కారు.. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలే’ అయి ఉండాలనే నిబంధనను పక్కన పెడుతోందా? పొరుగు రాష్ట్రాల్లో కూడా లేని విధంగా మహిళలకు అద్భుత అవకాశం కల్పించనుందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రకటించిన విధివిధానాలను గమనిస్తే ఇలాంటి అభిప్రాయమే కలుగుతోంది.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితప్రయాణం అనే కూటమి సర్కారు హామీ ఆగస్టు 15వ తేదీనుంచి అమలు కానుంది. తెలుగుదేశం పార్టీ తొలుత తమ మేనిఫెస్టోలో మహిళలకు వారి సొంత జిల్లాల్లో ఉచిత ప్రయాణం అని హామీ ఇచ్చింది. తీరా అమలుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించిన తర్వాత.. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ఒక సందర్భంలో మాట్లాడుతూ.. సొంత జిల్లాలు అంటే.. వారు ఉన్నవే కాకుండా పూర్వ ఉమ్మడి జిల్లాలకు కూడా వర్తించేలా అమలు చేయనున్నట్టు వెల్లడించారు. మరొక సంద్రభంలో మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణం చేయవచ్చునని ప్రకటించారు. మొత్తానికి ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎండీ ద్వారకా తిరుమల రావు చర్చలు జరిపి నిబంధనలను ఫైనలైజ్ చేశారు. ఈ ప్రకారం రాష్ట్రమంతా ఉచిత ప్రయాణ అవకాశం దక్కుతుంది. కేబినెట్ సమావేశం తరవాత విధివిధానాల గురించి పూర్తి స్పష్టత వస్తుందని అనుకుంటున్నారు.
ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ ప్రకటించిన ప్రకారం.. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదో ఒక గుర్తింపు కార్డును చూపించి.. మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. కొనకళ్ల చెబుతున్న ప్రకారం మహిళలు తమ ఆధార్, ఓటరు, పాన్ కార్డుల్లో ఏదైనా చూపించవచ్చు. ఆధార్, ఓటరు కార్డుల్లో చిరునామా ఉంటుంది. పాన్ కార్డులో చిరునామా ఉండదు. అంటే ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు తమ పాన్ కార్డు చూపించి.. ఏపీలో ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణించడానికి అవకాశం దొరుకుతుందన్న మాట. తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న విధానంలో ఆధార్ కార్డు విధిగా చూపించాలనేది నిబంధన. నూరుశాతం పౌరులకు ఆధార్ ఉందనే అభిప్రాయంతో ఈ నిబంధన అమలు చేస్తున్నారు. ఆధార్ కార్డుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర చిరునామా లేకపోతే.. వారికి ఉచిత ప్రయాణ అవకాశం లేదు. మరి ఏపీలో కొత్త పద్ధతి ప్రకారం.. పాన్ కార్డుతో ప్రయాణం ఉచితంగా అనుమతిస్తే.. ఇతర రాష్ట్రాల వారు కూడా వాడుకోడానికి అవకాశం ఉంటుంది.