హవ్వ! బెయిలు ఇస్తే ఇలా చేస్తారా?

న్యాయస్థానం ఇచ్చే వెసులుబాటును కూడా దుర్వినియోగం చేయడంలో తాము ఘనాపాటీలం అని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో దుర్మర్గాలకు పాల్పడిన వారు నిరూపిస్తున్నారు. జగన్ సీఎంగా ఉండగా.. అడ్డగోలు దోపిడీలకు పాల్పడిన వారు.. కొందరు ఇప్పుడు కేసులు నమోదు అయిన తర్వాత విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కొందరు అరెస్టు అయి రిమాండుల్లో గడుపుతున్నారు. కొందరు బెయిలుపై బయటే తిరుగుతున్నారు. కీలక అవినీతి కేసుల్లో బెయిలు పొందిన వారు.. బయటకు వచ్చి.. తమ నేరం బయటపడే ఆధారాలను అన్నింటినీ సర్వనాశనం చేసేలా ప్రవర్తిస్తుండడం ఇప్పుడు ప్రజలను విస్మయపరుస్తోంది. ఇలాంటి వారికి బెయిలు ఇస్తే.. ఎంతటి దుర్మార్గాలకైనా తెగించగలరని ప్రజలు అంటున్నారు. వివరాల్లోకి వెళితే..
గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇసుక, లిక్కరు వ్యాపారాల్లో వేలాది కోట్ల రూపాయలు దోచుకున్న సంగతి ప్రజలందరికీ తెలిసిందే. ఇసుక విషయంలో నూతన విధానం తెస్తున్నాం అంటూ దాదాపు సంవత్సరం పాటు నిర్మాణరంగాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి చివరికి ప్రజలను ఎడాపెడా దోచుకోడానికి తగిన విధానం తెచ్చారు. ఇసుక వ్యాపారంలో పార్టీలోని అధినాయకులు వేల కోట్లు దోచుకుంటే.. స్థానికంగా ప్రతినియోజకవర్గంలోనూ నాయకులు పదుల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇలా నిరాటంకంగా దోపిడీ పర్వం సుదీర్ఘకాలం సాగింది. అప్పటి గనుల శాఖ డైరక్టర్ వీజీ వెంకటరెడ్డి మొత్తం ఇసుక కుంభకోణాలకు సూత్రధారిగా వ్యవహరించారు.

బినామీ పేర్లతో కంపెనీలకు కేటాయింపులు, అక్రమ బిల్లుల చెల్లింపులు ఇలాంటి అనేక అక్రమాలు ఆయన హయాంలో జరిగాయి. ఆయనను అరెస్టు చేసిన తర్వాత రెండు దఫాలుగా కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులతో నేరాలను ఒప్పుకుంటూనే.. ఎవరు పురమాయిస్తే ఆ పనిచేశానో అడగవద్దని వెంకటరెడ్డి అనడం కూడా బాగా చర్చల్లో నడిచింది.

తీరా ఆయనకు బెయిలు వచ్చింది. అరెస్టు అయినప్పుడు.. తనకు డిపార్టుమెంట్ ఇచ్చిన లాప్ టాప్ కనిపించడం లేదని చెప్పిన వెంకటరెడ్డి.. బెయిలు తర్వాత దానిని తెచ్చి అప్పగించారు. అయితే అందులో ఉన్న డేటా మొత్తం చెరిపేసి ఏ సాక్ష్యాలూ దొరకకుండా.. చేశారు. ఆయన గతంలో వాడిన రెండు ఐఫోన్లు కూడా ఏమయ్యాయో తెలియదని పోలీసులకు చెప్పాడు. మొత్తం ఆధారాలను చెరపివేసినట్టు పోలీసులు గుర్తించారు. అరెస్టు అయినప్పుడు లాప్ టాప్ కనపడడం లేదని చెప్పి, బెయిలు రాగానే డేటా మొత్తం చెరిపేసి ఇవ్వడం అనేది సీరియస్ విషయంగా పరిగణిస్తున్నారు. న్యాయస్థానం ఇచ్చిన బెయిలును ఇలా దుర్వినియోగం చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఈవిషయంలో వెంకటరెడ్డి ఎవరిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారో వారి వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories