సకల శాఖల మంత్రిగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కీర్తి గడించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖను తన కనుసున్నలలో ఆడిస్తూ, తద్వారా దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలలోనూ ముఖ్యమంత్రి స్థాయిలో తానే పెత్తనం చేస్తూ సెటిల్మెంట్లు నడిపిస్తూ వచ్చారనేది ఆయన మీద ఉన్న తీవ్రమైన ఆరోపణ. రాష్ట్రంలో ఏ మూల కూడా వదిలిపెట్టకుండా ఎక్కడ కించిత్తు ఖాళీ కనిపిస్తే జాగాలన్నింటినీ కబ్జా చేశారని ఆయన గురించి అన్ని ప్రాంతాలలోనూ వినిపిస్తుంది. కేవలం అవినీతి, అరాచకాలు, భూకబ్జాలు మాత్రమే కాదు.. సజ్జల రామకృష్ణారెడ్డి అక్రమార్జనలకు పాల్పడిన వక్రమార్గాలలో రంకు బాగోతాల సెటిల్మెంట్లు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముంబాయికి చెందిన ఒక హీరోయిన్ తో వివాహేతర సంబంధం నడిపి అది కాస్త వివాదంగా మారిన తర్వాత ఆమెను వదిలించుకోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ఓ పెద్ద దందా నడిపించిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇదే వ్యవహారంలో సదరు సినీనటి నుంచి అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబాయి పారిశ్రామికవేత్తతో డీల్ కుదుర్చుకుని కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లుగా కూడా వినిపిస్తోంది. వైసీపీ వారి అక్రమాలకు ప్రభుత్వ కార్యకలాపాలు, భూములను దిగమింగడాలు, సెటిల్మెంట్లు మాత్రమే చానలేదని రంకు బాగోతాల మీద కూడా సెటిల్మెంట్లతో డబ్బు సంపాదించే ధోరణి ఈ వైసిపి నాయకుల్లో తప్ప మరెక్కడా కనిపించదని పలువురు అసహ్యించుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కొడుకు కుక్కల విద్యాసాగర్ కొన్నాళ్ల కిందట హైదరాబాదులోని ఒక పెళ్ళిలో ముంబాయికి చెందిన సినీ నటితో పరిచయం పెంచుకున్నారు. సదరు విద్యాసాగర్ 2014లో వైసీపీ తరఫున పెనమలూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసిన వ్యక్తి కావడం విశేషం. ముంబయి హీరోయిన్ తో సుదీర్ఘకాలం సన్నిహితంగా గడిపారు. ఆమె తనను పెళ్లి చేసుకోవాలని కోరిన తర్వాత తిరస్కరించిన విద్యాసాగర్ ఆమె నుంచి ఒత్తిడి రావడంతో సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిని ఆశ్రయించారు. ఆయన అప్పటి విజయవాడ నగర కమిషనర్ కాంతిరాణా తాతాను పురమాయించడంతో ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ముంబాయికి పంపి సినీ నటి, ఆమె కుటుంబ సభ్యులందరి మీద కేసులు పెట్టించి అరెస్టు చేసి తీసుకువచ్చి రిమాండ్ కు పంపడం జరిగింది. ఆ తరువాత వారిని తీవ్ర స్థాయిలో బెదిరించి వారి మీద తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకుని తిప్పి పంపినట్లుగా ఇప్పుడు బయటకు వస్తోంది. ఈలోగా ఇదే సినీనటితో వివాహేతర సంబంధం నడిపిన ముంబాయి బడా పారిశ్రామికవేత్త ఒకరు ఆమెనించి అత్యాచార ఆరోపణలను ఆ సమయంలో ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సంగతి కూడా గ్రహించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పారిశ్రామిక వేత్తతో డీల్ కుదుర్చుకుని ఆ హీరోయిన్ మీద కేసులు పెట్టి బెదిరించి వెనక్కు తగ్గేలా చేసినట్లు సమాచారం. ముంబాయి పారిశ్రామిక వ్యక్తి నుంచి చాలా పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో నాయకులందరూ అవినీతిమయమైన పనులు చేస్తూ బతికారు అనేది అందరూ గుర్తించారు కానీ ఇంత అసహ్యకరమైన రంకు పంచాయతీలు చేసుకుంటూ అగ్ర నాయకులు కూడా దిగజారి పోవడాన్ని చూసి మరింతగా ఈసడించుకుంటున్నారు.