తమకు అనుకూలంగా మారి సాక్ష్యాలు చెబితే 20 కోట్లు ఇస్తాం.. చెప్పకపోతే ప్రాణాలు తీస్తాం.. అంటూ సినిమా ఫక్కీలో జైలులోకే వెళ్లి ఒక ఖైదీని బెదిరించిన వ్యవహారం.. ఇప్పుడు డాక్టర్ చైతన్యరెడ్డి అరెస్టు వరకు దారితీసేలా కనిపిస్తోంది. తండ్రిని హత్య కేసు నుంచి నిర్దోషిగా బయటకు తీసుకురావడానికి, ఆత్మీయుడైన ఎంపీ అవినాష్ రెడ్డికి ఎలాంటి చిక్కులు రాకుండా చూసుకోవడానికి, అల్టిమేట్‌గా జగనన్న కళ్లలో ఆనందం చూడడానికి ఏకంగా 20 కోట్ల ఆఫర్ తో వెళ్లిన చైతన్యరెడ్డి ఎలాంటి చట్టవ్యతిరేకమైన పాత్ర పోషించారో.. ఇప్పుడు సాక్ష్యాలతో సహా వెలుగులోకి వస్తోంది. దస్తగిరి నమోదు చేసిన కేసు దర్యాప్తు పురోగతిని గమనిస్తోంటే.. కీలక నిందితుడు చైతన్యరెడ్డికి అరదండాలు తప్పకపోవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన పాత్రధారుల్లో ఒకరైన శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి. దస్తగిరి ఈ కేసులో అప్రూవర్ గా మారిన తర్వాత.. వేరే కేసులో ఆయన కడప సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు.. డాక్టర్ చైతన్యరెడ్డి అక్కడ ఖైదీల కోసం వైద్య శిబిరం నిర్వహించారు. ఆ ముసుగులోనే ప్రలోభాలు, బెదిరింపుల వ్యవహారం మొత్తం జరిగింది. ఇప్పుడు అదే కేసు దర్యాప్తు జరుగుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ దర్యాప్తు సాగిస్తున్నారు.
జైలులోని పలువురు అధికారులు, అప్పటి ఇప్పటి అధికారులు, సిబ్బందిని కూడా విచారించారు. దస్తగిరి ప్రధానంగా చైతన్యరెడ్డి, అప్పటి సూపరింటెండెంటు ప్రకాశ్ తదితరులపై ఫిర్యాదు చేశారు. విచారణలో వారితో పాటు పలువురితో మాట్లాడిన తర్వాత.. ఆరోజున డాక్టర్ చైతన్య రెడ్డి దస్తగిరి ఉంటున్న బ్యారక్ కు వెళ్లిన మాట వాస్తవమే అని నిర్ధరణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం.
వివేకా హత్య కేసుల్లో ప్రధాన నిందితుల్లో ఒకరైన శివశంకర రెడ్డి ఇప్పటికే జైలులో ఉన్నారు. ఆయన బెయిలు పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తండ్రిని కాపాడుకోవడం చైతన్యరెడ్డి యొక్క ఒక లక్ష్యం కావొచ్చు. కానీ 20 కోట్ల ఆఫర్ అతనే చేశాడా.. అతని వెనుకనుంచి ఎవరైనా చేయించారా? అనేది కూడా కీలకం. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర.. ఈ హత్య వెనుక కీలకంగా ఉన్నట్టు ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అంత పెద్ద మొత్తం ఆఫర్ ఎవరు చేయించారు.. అనేది కూడా ఈ కేసు విచారణ ద్వారానే తేలవలసి ఉంది. మొత్తానికి అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అండచూసుకుని.. ఏకంగా జైల్లోకే వెళ్లి బెదిరించడం సాధ్యమైంది గానీ.. సర్కారు మారిన తర్వాత.. చైతన్యరెడ్డి కూడా కటకటాలు లెక్కించక తప్పదని పలువురు అంచనా వేస్తున్నారు.