జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని రెచ్చిపోయి మాట్లాడినందుకు పోలీసు కేసులు చుట్టు ముడుతూ ఉంటే సినిమా రచయిత, నటుడు పోసాని కృష్ణమురళికి జ్ఞానోదయం అయినట్టు కనిపిస్తోంది. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నట్టు ప్రకటించారు. జీవితంలో ఇక రాజకీయాలు మాట్లాడను అంటూ ప్రతిజ్ఞ చేశారు. పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటిస్తున్నారు. ఇక్కడితో పోసాని జీవితంలో జగన్మోహన్ రెడ్డి ని భజనచేయడం కూడా పూర్తిగా ఆగినట్టే.
జగన్మోహన్ రెడ్డిని భజన చేయడం ద్వారా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత లబ్ధి పొందిన కొందరు సినీ నటుల్లో పోసాని కృష్ణమురళి కూడా ఒకరు. జగన్ ప్రాపకం ద్వారా.. జగన్ కు ఇష్టంలేని నాయకులను పదేపదే తిట్టడం ద్వారా.. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవిని దక్కించుకున్నారు. అనుభవించారు. జగన్ ను ప్రజలు ఓడించారు. ఆ పార్టీ అధికారంలోంచి దిగిపోయింది. ఎఫ్డీసీ పదవి కూడా పోయింది. కాకపోతే.. పోసాని తిట్టిన తిట్లు మాత్రం రికార్డుల్లో అలాగే మిగిలిపోయాయి. ఆ పాపాలు ఇప్పుడు ఆయనను వెన్నాడుతున్నాయి. గతప్రభుత్వ కాలంలో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ లను అత్యంత అసభ్యంగా దూషించినందుకు పోసాని కృష్ణ మురళి మీద ఏపీలో పలుచోట్ల కేసులు నమోదు అవుతున్నాయి.
నోటీసులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన విలేకర్ల సమావేశం ఏర్పాటుచేసి తన రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారు.
నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్న సమయంలో అందరినీ విమర్శిస్తుంటానని అనుకుంటారు. నేను నాయకుల నీతి నిజాయితీలు నడవడికను బట్టి మాట్లాడానే తప్ప.. ఏ మంచి నాయకుడినీ విమర్శించలేదు- అంటూ ఇప్పటికీ పోసాని తన మాటలను సమర్థించుకున్నారు.
పాయింట్ ఏంటంటే.. మంచి నాయకుడైనా చెడు నాయకుడైనా విమర్శించడంలో తప్పేం లేదు. కాకపోతే ఆ విమర్శలకు వాడుతున్న భాష ఎలాంటిది? విమర్శిస్తున్న తీరు ఎలాంటిది? అనేది చాలా కీలకం. గతంలో తాను చంద్రబాబును ఎంతో పొగిడానని కూడా అంటున్న పోసాని కృష్ణ మురళి.. ఇప్పుడు రాజకీయాలనుంచి తప్పకున్నంత మాత్రాన తనపై కేసులు ఎత్తేయరు కదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ. ఇక జన్మలో రాజకీయాలు మాట్లాడను అంటూ లెంపలు వాయించుకున్నట్టుగా పశ్చాత్తాపం ప్రకటించడం చూస్తోంటే ఆయనకు జ్ఞానోదయం అయినట్టుందని ప్రజలు అనుకుంటున్నారు.