ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ శాసనసభ స్పీకరుగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం తొలిసారిగా సమావేశం అయిన శాసనసభలో ఎమ్మెల్యేలు అందరి ప్రమాణాలు పూర్తయిన తర్వాత.. అయ్యన్నపాత్రుడు తరఫున కూటమి నాయకులు పవన్ కల్యాణ్, అచ్చెన్నాయుడు, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, సత్యకుమార్ నామినేషన్ పత్రాలు అందజేశారు. స్పీకరు పదవికి అయ్యన్న ఒక్కరి తరఫున మాత్రమే నామినేషన్ దాఖలు కావడంతో.. ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది.
కాగా, చింతకాయల అయ్యన్నపాత్రుడు సభాపతి స్థానంలోకి వస్తుండడం.. ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి చేదుమాత్ర వంటిదే అని విశ్లేషకులు భావిస్తున్నారు. తాను అధికారంలో ఉండగా.. చాలా మంది తెదేపా నాయకులను టార్గెట్ చేసి జైళ్లకు పంపినట్టే, అయ్యన్న మీద కూడా కక్ష సాధించాలని జగన్ అనేక ప్రయత్నాలు చేశారు. అయితే.. న్యాయపరమైన అంశాలపై అవగాహన ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు ముందే కోర్టులను ఆశ్రయించి.. అరెస్టు జైలు దాకా పరిస్థితులు రాకుండా జాగ్రత్తపడ్డారు.
అదే సమయంలో.. జగన్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడడంలో అయ్యన్నపాత్రుడు ఎప్పుడూ ముందుండేవారు. తీవ్రమైన పదజాలంతో జగన్ ను దూషిస్తుండేవారు. ఆ వ్యాఖ్యలను ఏమాత్రం సహించలేకపోయినా అయ్యన్నను జగన్ ఏమీ చేయలేకపోయారు. గురువారం నాడు పార్టీ అభ్యర్థులందరితో నిర్వహించిన సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి, అయ్యన్న పాత్రుడి మీద తన అక్కసును వెళ్లగక్కారు. స్పీకరుగా ఎవరు రాబోతున్నారో తెలుస్తోందని, జగన్ ఓడిపోయాడు అంతే.. చచ్చిపోలేదు.. అంటూ ఆయన తన గురించి వ్యాఖ్యానించారని జగన్ సమావేశంలో వాపోయారు. అయ్యన్న మీద ఆయనకు ఉన్న అక్కసుకు తగినట్టుగానే.. శనివారం సభాపతి స్థానంలో అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి, సాంప్రదాయానికి భిన్నంగా, జగన్ గైర్హాజరు కాబోతున్నారు. ఆయన శనివారం నుంచి మూడు రోజుల పాటూ పులివెందుల నియోజకవర్గంలో పర్యటన పెట్టుకున్నారు. ఓటమిని సహించలేక అసెంబ్లీకి డుమ్మా కొట్టడం అనేది జగన్ తొలి సమావేశాల నుంచే ప్రారంభిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.