జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో అడ్డగోలుగా వ్యవహరించి లిక్కర్ విక్రయాల కోసం కొత్త పాలసీ రూపొందించి, డిస్టిలరీల నుంచి నేరుగా కోట్లకు కోట్ల వాటాలు ముడుపులుగా స్వీకరించిన అతిపెద్ద కుంభకోణంలో.. నాలుగేళ్లలో దాదాపుగా 3500 కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లుగా సిట్ ప్రాథమికంగా నిర్ధారించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇంత పెద్ద మొత్తాన్ని డిస్టిలరీలనుంచి నగదుగా ముడుపులు స్వీకరించిన నేపథ్యంలో.. దానిని ఇతర మార్గాల్లోకి ఎలా మళ్ళించారు అనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల రూపంలోనూ, బంగారంగా మార్చి నిలవ చేయడం ద్వారా అంతిమలబ్ధిదారుకు చేరినట్లుగా ఇప్పటికే సిట్ పోలీసుల పలు ఆధారాలు సేకరించారు. ఈ బాగోతంలో పాలుపంచుకున్న అనేకమంది బంగారం వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను కూడా సిట్ పోలీసులు విచారించారు. ఇదంతా ఒక ఎత్తుకాగా హవాలా రూపంలో విదేశీ రియల్ ఎస్టేట్ కంపెనీల్లోకి పెట్టుబడులను అక్రమంగా తరలించారనేది మరో ప్రధాన ఆరోపణ. హైదరాబాదు నుంచి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో దుబాయిలోని ఇన్ ఫ్రా రంగం సంస్థలలోకి పెట్టుబడులను మళ్లించినట్లుగా గతంలో తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటులోనూ ప్రస్తావించారు. ఆ తర్వాత హోం మంత్రి అమిత్ షాను కలిసి తన వద్ద ఉన్న ఆధారాలతో సహా వివరించి చెప్పారు.
పర్యవసానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. లిక్కర్ కుంభకోణంలో అక్రమ వసూళ్లు ఏ రకంగా రూపుమార్చుకున్నాయో ఆరా తీయడం ప్రారంభించారు. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడు ఏ1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నుంచి వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో ఈడీ గురువారం పిటిషన్ దాఖలు చేసింది.
మొత్తం మూడున్నర వేల కోట్ల రూపాయల కుంభకోణంలో హవాలా రూపంలో దేశం దాటిన సొమ్ము ఎంత? అనేదానికి సంబంధించి ప్రాథమిక వివరాలు రాజ్ కేసిరెడ్డి ద్వారానే సేకరించడానికి ఈడీ పూనుకుంటున్నట్లుగా అర్థమవుతోంది. లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే పలువురు నిందితులు అరెస్టు అయ్యారు. మిగిలిన వారిని కూడా దశలుదశలుగా సిట్ విచారిస్తున్నది, ఈడీ రంగంలోకి దిగడం వలన కేసు విచారణ మరింత జోరందుకుంటుందని, శిక్షల ఖరారు కూడా కాస్త వేగంగా జరుగుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈకేసులో ఏ 1 కెసిరెడ్డి రాజశేఖరరెడ్డి మీద తొలి నజర్ వేయడం ద్వారా ఈడి పన్నిన ఉచ్చు అంతిమ లబ్ధిదారు మెడకు ఏ రకంగా చుట్టుకుంటుందో వేచిచూడాలి.