జగన్ దళాలకు ఇది ప్రమాదఘంటిక. ఇన్నాళ్లుగా సిట్ పోలీసులు విచారిస్తున్న మద్యం స్కామ్ లోకి ఇప్పుడు ఈడీ రంగ ప్రవేశం చేసింది. దేశం మొత్తం దిమ్మెరపోయేలా ఏ రాష్ట్రంలోనూ చరిత్రలో ఇప్పటిదాకా జరగని స్థాయిలో జరిగిన ఈ అతిపెద్ద లిక్కర కుంభకోణంలో మూడున్నర వేల కోట్ల రూపాయలు చేతులు మారడంలో అనేక విదేశీ లింకులు, మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు, ఆర్థిక అక్రమాలు కూడా ఉన్నట్టుగా తేటతెల్లం అవుతుండడంతో వాటి అంతు తేల్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది. శర్వాణీ డిస్టిలరీ డైరక్టర్ చంద్రారెడ్డికి 28న విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈడీ రంగంలోకి దిగిన తర్వాత.. వ్యవహారం ముదిరి పాకాన పడినట్టేనని పలువురు భావిస్తున్నారు. మూడున్నర వేల కోట్లు దోచుకోవడంలో కీలక భూమిక పోషించిన వారంతా.. మరింత కఠినమైన శిక్షలకు మానసికంగా సిద్ధపడాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మద్యం కేసులోకి ఈడీ ప్రవేశించడం గురించి కొన్ని నెలలుగా ఊహాగానాలు సాగుతున్నాయి. లిక్కర్ కుంభకోణం ద్వారా అడ్డదారుల్లో సంపాదించిన సొమ్మును హవాలా మార్గాల్లో దుబాయి తరలించి.. అక్కడ రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని తెలుగుదేశం పార్టీ లోక్ సభా పక్ష నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్ సభలో ప్రస్తావించారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని దర్యాప్తు చేయించాల్సి ఉన్నదని లావు విజ్ఞప్తి చేశారు. ఇది హవాలాకు సంబంధించిన ఆరోపణలు కావడంతో కేంద్రం కూడా సీరియస్ గా తీసుకుంది. ఆ మరునాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎంపీ లావు కృష్ణదేవరాయలును ప్రత్యేకంగా తన వద్దకు పిలిపించుకుని.. ఆయన చేసిన ఆరోపణల గురించి మరింత వివరంగా అడిగి తెలుసుకున్నారు. కృష్ణదేవరాయలు తాను చేసిన ఆరోపణలన్నింటికీ సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను కూడా కేంద్ర హోంమంత్రికి అందజేసినట్టుగా వార్తలు వచ్చాయి. అప్పటినుంచి ఏదో క్షణాన ఈడీ రంగంలోకి దిగుతుందనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఇటీవల ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి ఈడీ కోర్టులో పిటిషన్ వేసింది కూడా. తాజాగా ఆ పర్వం మొదలైంది.
జగన్ దళాలకు భారీగా ముడుపులు ముట్టజెప్పిన డిస్టిలరీల్లో ఒకటైన శర్వాణీ డిస్టిలరీస్ డైరక్టర్ ఎనకొండ చంద్రారెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. మనీలాండరింగ్ వ్యవహారాలు పూర్తిగా ఈడీ పరిధిలోకే వస్తాయి. జగన్ పాలన కాలంలో అతి ఎక్కువగా లిక్కరు ఆర్డర్లు పొందిన కంపెనీల్లో శర్వాణీ కూడా ఒకటి. ఆ విషయం సిట్ ఛార్జిషీటులో ప్రధానంగా ఉంది. అధిక ఆర్డర్లు పొందిన ఆంధ్రా గోల్డ్ విస్కీ వీరి ఉత్పత్తి అనే తేల్చారు. అలాగే ఈ కంపెనీనుంచి వచ్చిన ప్రతి ఆర్డర్ రిక్వెస్ట్ ను కూడా అనుమతించినట్టుగా సిట్ గుర్తించింది. 2019-20 లో కే కేవలం 4 లక్షల కేసుల ఆర్డర్ పొందిన శర్వాణీ.. ఆ తర్వాత వరుసుగా ప్రతి ఏడాదీ 16 లక్షల కేసుల వంతు న ఆర్డర్లు పొందింది.
కాగా, ఈ చంద్రారెడ్డికి ఎంపీ మిథున్ రెడ్డితోను, ఇంకా పలువురు వైసీపీ నేతలతోను దగ్గరి సంబంధాలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. మొత్తానికి ఈడీ రంగంలోకి దిగిన తర్వాత తొలి విచారణ శర్వాణీ చంద్రారెడడ్డితో మొదలవుతోంది. వారి తరహా విచారణలో సిట్ కూడా రాబట్టలేని ఇంకెన్ని కొత్త సంగతులు వెలుగులోకి వస్తాయోనని అంతా అనుకుంటున్నారు.