ప్రభుత్వ సలహాదారులు అంటే ఖచ్చితంగా వారు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సేవకులు మాత్రమే. అయితే ఎలాంటి చట్టబద్ధమైన నియమాలకు, పద్ధతులకు కూడా విలువ ఉండని ఏపీ రాజకీయాల్లో మాత్రం ఈ వైనం మనకు కనిపించదు. ప్రభుత్వ సలహాదారులుగా లక్షలకు లక్షల వేతనాలు తీసుకుంటూ.. అన్ని రకాల ప్రభుత్వ సదుపాయాలను పొందుతూ.. ఇప్పుడు కీలకమైన ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి డైరక్టుగా ప్రచారం చేస్తున్న వారితీరు వివాదాస్పదం అవుతోంది. ఒక్కొక్క సలహాదారు మీద ఒక్కరొక్కరుగా ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదులు చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. సలహాదారులను విచ్చలవిడిగా నియమించుకున్నారు. హోదా పరమైన లాంఛనాలు, మర్యాదలు, ఖర్చులు కాకుండా.. నెలకు సుమారు రెండులక్షల రూపాయల వరకు వేతనాలు తీసుకునే ఈ సలహాదారులు నిజంగా ప్రభుత్వానికి ఏం సలహాలు ఇస్తూ వచ్చారో ఎవ్వరికీ తెలియదు.
అసలు సలహాదారులు అనే వ్యవస్థే హాస్యాస్పదం అయ్యేలాగా జగన్ దానిని మార్చేశారు. గతంలో సాక్షికి ఎడిటర్ గా చేసిన రామచంద్రమూర్తిని సలహాదారుగా నియమించుకుంటే.. అసలు ఈ పోస్టులో పనే లేదు. నాకీ పదవి వొద్దు. సలహాలు అడిగేవాళ్లూ, ఇస్తే తీసుకునేవాళ్లూ ఎవరూ లేరు అని ఆయన ఛీత్కరించి.. ఆ పదవిని వదలుకుని వెళ్లిపోయారు. తన తైనాతీలు, రాజకీయ పైరవీలు చేయడానికి ఉపయోగపడే వారినందరినీ జగన్ తీసుకువచ్చి.. వారికి సలహాదారులు అనే ఒక పదవిని కట్టబెట్టి.. ప్రభుత్వం సొమ్మును పంచిపెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఇలా చాటుమాటుగా ఈ సలహాదారులు ఎన్ని రాజకీయ కార్యకలాపాలు చేసినా ఓకే. ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చిన తరువాత.. ప్రభుత్వాధికారులు ఎవ్వరూ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. అలా పాల్గొంటే వేటు పడుతోంది. అయినా సరే.. సలహాదారులు మాత్రం బరితెగించి అదే పనిచేస్తున్నారు.
సజ్జల రామక్రిష్ణారెడ్డిని ఆ పదవినుంచి తొలగించాలని, ఆయన వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు పెట్టి.. రాజకీయ సమీక్షలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు తదితరులు ఎన్నికల ప్రధాన అధికారికి ఫర్యాదు చేశారు. అదే తరహాలో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ వాళ్లు మరో సలహాదారుమీద ధ్వజమెత్తుతున్నారు.
ఉద్యోగుల సంక్షేమం చూడాల్సిన సలహాదారుగా చంద్రశేఖర రెడ్డిని జగన్ నియమించుకున్నారు. ఆయన ఆ సంగతి పట్టించుకోకపోగా, ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుతున్నారంటూ పెన్షనర్స్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ పదవిలో ఉండి పెన్షనర్లను మభ్యపెట్టి వైసీపీకి ఓటువేయించాలని చూస్తున్నారని ఇలాంటివారిని పదవినుంచి తొలగించాలని కోరుతున్నారు. ఇలాంటి రాజకీయ కార్యకలాపాల్లో ఫుల్లుగా నిమగ్నమై ఉన్న ఇతర సలహాదారులను కూడా కలిపి ఈసీ వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.