రేపో మాపో.. జనసేనలోకి పెండెం దొరబాబు!

పిఠాపురం ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెండెం దొరబాబు త్వరలో జనసేన పార్టీలో చేరబోతున్నారా? ఇప్పటిదాకా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ ను గెలిపించేందుకు ఆయన తన సర్వశక్తులూ ఒడ్డి పనిచేయనున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సిటింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ, టికెట్ ఇవ్వకుండా జగన్ తిరస్కరించిన వారిలో పిఠాపురం పెండెం దొరబాబు కూడా ఒకరు. ఆయన ఇప్పుడు పార్టీ మారబోతున్నట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ తుదివిడత అభ్యర్థిత్వాలను ప్రకటించిన తర్వాత.. అంటే పవన్ కల్యాణ్ తాను పిఠాపురం నుంచి పోటీచేస్తున్నట్టుగా జాబితాలరూపంలో అధికారికంగా ప్రకటించిన తర్వాత దొరబాబు చేరిక ఉంటుందని అంచనాలు సాగుతున్నాయి.

నిజానికి పెండెం దొరబాబు జనసేనలో చేరుతారనే ఊహాగానాలు ఇప్పుడు పుట్టినవి కాదు. నాలుగు నెలల కిందటే అలాంటి ప్రచారం జరిగింది. అప్పట్లో తన పార్టీ మార్పు గురించి సంకేతాలు ఇచ్చేలా దొరబాబు మాట్లాడడం రాజకీయ వర్గాల్లో సంచలనం అయింది. ఆయన జనసేనలోకి వెళ్తున్నారంటూ అనేక వార్తాకథనాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత పరిస్థితి కాస్త సద్దుమణిగింది.

తర్వాతి పరిణామాల్లో.. ఎమ్మెల్యేలను బదిలీచేస్తూ, టికెట్లు నిరాకరిస్తూ ఒక్కటొక్కటిగా తేలుస్తూ వచ్చిన జగన్.. ఎంపీ వంగా గీతను పిఠాపురం ఇన్చార్జిగా పంపి.. పెండెం దొరబాబుకు రిక్తహస్తం చూపించారు. ఆ సమయంలోనే దొరబాబు.. పిఠాపురం నుంచి తానే పోటీచేస్తానని, చివరి వరకు ఏమైనా జరగవచ్చునని కూడా అన్నారు. అలిగి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లాంటివి జరగలేదు. ఎమ్మెల్యేహోదాలో తాను, కొత్త ఇన్చార్జి వంగా గీతతో కలిసి అనేక అధికారిక కార్యక్రమాల్లో ఇప్పటిదాకా పాల్గొంటూనే ఉన్నారు. అయితే చాపకిందనీరులా.. గుట్టుచప్పుడు కాకుండా.. ఆయన జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పవన్ తో ఈమేరకు మంతనాలు కూడా పూర్తయ్యాయనే వినిపిస్తోంది.

పిఠాపురంలో గత ఎన్నికల్లో దొరబాబు చేతిలో ఓడిపోయిన తెలుగుదేశం నాయకుడు వర్మ ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నారు. ఆయనను బుజ్జగించే బాధ్యతను చంద్రబాబునాయుడు చూస్తున్నారు. ఒకవేళ ఆ బుజ్జగింపులు ఫలించకపోయినా సరే.. తెలుగుదేశం పార్టీకి ఉండగల ఓటు బ్యాంకు స్థిరంగానే ఉంటుందని, వర్మ సొంత వర్గీయులు మాత్రం దూరం అవుతారని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. అదే మాదిరి సమీకరణాన్ని వైసీపీ మీదకు పవన్ ప్రయోగిస్తున్నారు. పెండెం దొరబాబును జనసేనలో చేర్చుకుంటే.. వైసీపీ స్థిరమైన ఓటుబ్యాంకు వారికి పడుతుంది. దొరబాబు వర్గీయులు, ఆయనదైన సొంత ఓటుబ్యాంకు తనకు అనుకూలంగా పడుతుందని ఆశిస్తున్నారు. ఈ సమీకరణాలు ఆశావహంగా కనిపించినందునే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, రేపో మాపో చేరిక పూర్తవుతుందని స్థానికంగా అనుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories