స్వామీజీలు అంటే ఒక మతంలోని మార్మికంగా ఉండే జీవన రహస్యాలను, ఆధ్యాత్మిక సంగతులను సామాన్యులకు అర్థమయ్యే రీతిలో తెలియజెప్పి వారిలో చైతన్యాన్ని తీసుకువచ్చే వారిగా మనం పరిగణిస్తాం. వారిని స్వాములుగా పూజిస్తూ ఎంతో విలువ ఇస్తాం, ఆరాధిస్తాం. అలాంటి స్వాములు కూడా ఐహికమైన విషయాలకు లోబడి సామాన్య మానవుల్లాగానే ప్రవర్తిస్తూ ఉంటే వారిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రోజుల్లో ‘స్వాములు’ అనే ట్యాగ్‌లైన్ తగిలించుకున్న వాళ్ళు కేవలం ఆధ్యాత్మిక పారమార్థిక విషయాలకు పరిమితం అవుతూ ఉండడం చాలా తక్కువ.
రాజకీయ రంగు పులుముకోకుండా వ్యవహరిస్తున్న వారు తక్కువ. తమ తమ స్వార్ధ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి రాజకీయ నాయకులతో భుజాలు భుజాలు రాసుకుని తిరుగుతూ వారి ద్వారా లబ్ధి పొందుతున్న వారే ఉంటున్నారు. ఇలాంటి స్వాములు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడు అవకాశవాదానికి తెరతీసి ఎవరి చేతిలో అధికారం ఉంటే వారికే జై కొట్టకుండా ఉంటారని గ్యారెంటీ ఏముంది?
విశాఖ కేంద్రంగా ఆధ్యాత్మిక వ్యాపారంలో ఉన్న శారద పీఠాధిపతి స్వరూపానంద ఒక్కసారిగా పార్టీ మార్చేశారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతో ఆత్మీయంగా ఇన్నాళ్లు వ్యవహరించిన స్వరూపానంద ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ల కోసం యాగాలు నిర్వహిస్తామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షిస్తున్నట్లు స్వరూపానంద చెప్పుకొచ్చారు. పనిలో పనిగా చంద్రబాబు నాయుడు గొప్పతనం గురించి భజన చేశారు. అయితే ఇవన్నీ కూడా ఆశ్రమం ముసుగులో తాను సాగించిన దందాలకు ఇబ్బంది రాకుండా చూసుకోవడం కోసం మాత్రమే అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతుంది.
ఒకప్పుడు టెన్నిస్ రాకెట్లకు రిపేర్లు చేసుకుంటూ, హఠాత్తుగా స్వామీజీ అయిపోయిన స్వరూపానంద తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులు, ఆత్మీయులు. కెసిఆర్ ద్వారా ఏర్పడిన బంధంతోనే అయిన జగన్మోహన్ రెడ్డికి కూడా దగ్గరయ్యారు. వైయస్ జగన్- స్వరూపానంద ఆశ్రమాన్ని అనేకమార్లు విజిట్ చేసి ఆయన కాళ్లు మొక్కేవారు. రాజకీయ నిర్ణయాలలో ఆయన పాత్ర చాలా ఉండేది.
కేసీఆర్, జగన్ ల కోసం ఆయన అనేకసార్లు రాజశ్యామల యాగం చేసేవారు. ఏయే ఆలయాలకు ఎవరు ఈవో గా ఉండాలో ఆయన నిర్ణయించేవారు. ఆయన ఒత్తిడితోనే దేవాదాయ శాఖకు ఒక ప్రత్యేక సలహాదారును నియమించిన చరిత్ర కూడా జగన్ పాలనలో ఉంది. జగన్ ను ప్రసన్నం చేసుకొని 150 కోట్ల రూపాయల విలువైన భూమిని ఆశ్రమం కోసం అనే మిష మీద చవకగా పొందిన స్వరూపానంద దానికి ఇతర అవసరాలకు వాడుకోవడానికి ప్రభుత్వం నుంచి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని అనుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు కొత్తగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల భజన చేయడానికి పూనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి అవకాశవాద స్వార్థ రాజకీయ స్వాములను చంద్రబాబు సర్కారు దూరం పెట్టాలని, వారి ఎత్తుగడలను నమ్మకూడదని ప్రజలు కోరుకుంటున్నారు.