భ్రష్టుపట్టకుండా.. చంద్రబాబు నిర్ణయం శెభాష్!

చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వేస్తున్న ప్రతి అడుగులోనూ అపరిమితమైన పరిణతి కనిపిస్తోంది. నలభైనాలుగేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం.. ఢక్కామొక్కీలు తిన్నటువంటి, ఎత్తుపల్లాలు చవిచూసినటువంటి అవగాహన ఆయన నిర్ణయాల్లో వ్యక్తం అవుతోంది.

తాజాగా మంత్రులు ఎమ్మెల్యేలకు చంద్రబాబు చేసిన సూచన గమనిస్తే శెభాష్ అనకుండా ఉండడం కష్టం. ఎందుకంటే.. ప్రధానంగా ఏ విషయంలో వేలు పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని మంత్రులు, సకల ఎమ్మెల్యేలు అందరూ భ్రష్టు పట్టిపోయారో.. సరిగ్గా అదే విషయంలో చంద్రబాబునాయుడు తమ వారికి ముందుగానే హెచ్చరిస్తూ కళ్లేలు వేస్తున్నారు.

ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దని చంద్రబాబునాయుడు తమ వారికి మార్గదర్శనం చేశారు. చంద్రబాబు ఇప్పటికే ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇసుక తవ్వకానికి అయ్యే ఖర్చు, సీవరేజీ చార్జీలు, రవాణా ఖర్చులు తప్ప ఇసుక కొనుగోలు కోసం ప్రజలు ఒక్కరూపాయి చెల్లించకుండా ఉండేలా ఇసుకవిధానం ఇప్పటికే అమలవుతోంది. అయితే ఇసుక వ్యవహారంలో ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ఎవ్వరూ కూడా జోక్యం చేసుకోవద్దని చెప్పడం.. చాలా ముందు చూపుతో చేసిన హెచ్చరికగా పలువురు భావిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి హయాంలో.. ఆయన అధికారంలోకి రాగానే.. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక తవ్వకాలు గానీ, విక్రయాలు గానీ జరగకుండా నిలిపేశారు. కొత్త విధానం తీసుకువస్తానంటూ సుదీర్ఘకాలయాపన చేశారు. ఈలోగా భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన కొన్న వేల లక్షల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఆత్మహత్యలు, ఆకలి చావులు కలిపి వేలల్లో జరిగాయి.

ఆ తర్వాత తమ నాయకులు దోచుకోవడానికి అనుకూలమైన ఒక కొత్త ఇసుక విధానం తెచ్చారు జగన్. దాంతో ఎక్కడికక్కడ వైసీపీ నేతలు చెలరేగిపోతూ వచ్చారు. ఇసుక దందాల్లోనే ప్రతిచోటా ప్రతి వైసీపీ నాయకుడూ కోట్ల రూపాయల దందాలు సాగించారు. ఇసుక అంటేనే.. అది వైసీపీ వారికి దోపిడీ మార్గంగా ప్రజల్లో ముద్రపడిపోయింది.

యావత్తు వైసీపీ నాయకులంతా ఇసుక దందాల పుణ్యమాని భ్రష్టు పట్టిపోయారు. చంద్రబాబునాయుడు తీరు చూస్తోంటే.. తమ పార్టీకి గానీ, ప్రభుత్వానికి గానీ, నాయకులకు గానీ అలాంటి చెడ్డపేరు రాకూడదని చూస్తున్నట్టుగా ఉంది. అందుకే ఆయన ఇసుక వ్యాపారంలో ఎవ్వరూ వేలు పెట్టవద్దని సూచించారని తెలుస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories