కొంతమంది నాయకులు అవమానం ఫీల్ అయ్యే బాపతు కాదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ మోచేతి నీళ్లు తాగడానికి ఉబలాట పడుతూ ఉంటారు. ఎలాంటి సిగ్గు ఎగ్గు లేకుండా ఉన్న పార్టీని వీడి గెలిచిన పార్టీలో చేరిపోతుంటారు. సాధారణంగా ప్రభుత్వం నుంచి బెదిరింపులు, వ్యాపారాలకు నష్టం జరుగుతుంది అనే భయాలు ఉన్నప్పుడు మాత్రమే నాయకులు ఉన్న పార్టీని వీడి అధికార పార్టీలో చేరడం జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమంది కేవలం అవకాశవాదానికి నిదర్శనంగా, రాజకీయ స్వార్ధ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం మాత్రమే ఇలా పార్టీలు మారుతూ ఉంటారు. అలాంటి వారి జాబితాలో రాజంపేటలో ఓడిపోయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటూన్నట్టు తెలుస్తోంది.
మేడా మల్లికార్జున్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గానే ఉన్నారు. వైసీపీలో చేరి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. ఆ పార్టీ నుంచి కూడా అనేక ప్రయోజనాలను పొందారు. తన కుటుంబంలో ఒకరికి టీటీడీ బోర్డు సభ్యత్వాన్ని కూడా ఇప్పించుకున్నారు. ఇప్పుడు వైసీపీ తరఫున ఆయనకు ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అలాగని అలిగి అప్పుడే తెలుగుదేశం పార్టీలో చేరి ఉంటే ఎంతో కొంత మర్యాద దక్కేది. కానీ ఆయన అదే పార్టీలో ఉంటూ ఎవరు నెగ్గుతారో చూద్దాం అని వేచి చూసే ధోరణిని అవలంబించారు. తీరా తెలుగుదేశం పార్టీ ఘనమైన మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేడా మల్లికార్జున్ రెడ్డి తెదేపాలో చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
అయితే తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తలు శ్రేణులు మాత్రం ఇలాంటి పోకడలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అవకాశవాద నాయకులు ఇటు అటు గెంతుతూ ఉంటే వారిని చంద్రబాబు నాయుడు ఏమాత్రం ప్రోత్సహించకూడదని వారు అభ్యంతర పెడుతున్నారు. మేడా మల్లికార్జున రెడ్డి లాంటి వాళ్లు అధికారం ఉన్నప్పుడే తమ చెంతకు చేరుతారని, మళ్ళీ ఓడితే నిర్మొహమాటంగా పార్టీని పక్కన పడేసి వెళ్లిపోతారని ఇలాంటి వారిని నెత్తిన పెట్టుకోవడం కరెక్ట్ కాదని చంద్రబాబుకు సూచనలు చేస్తున్నారు. పొత్తులతో ప్రభుత్వంలోకి వచ్చిన నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులు లాంటివి కూడా అన్ని పార్టీల ఆశలు తీరేలాగా పంపకాలు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో అవకాశవాద నాయకులు ఫిరాయించి వస్తే వారందరినీ చంద్రబాబు ఎలా సంతృప్తి పరచగలరు? అసాధ్యం కదా? కాబట్టి ఇలాంటి వారిని చేర్చుకోకుండా ఉండడం మంచిదని అంటున్నారు! ఒకవేళ కచ్చితంగా చేరాల్సిందే అని వారు బ్రతిమాలితే గనుక బేషరతుగా, ఎలాంటి పదవుల హామీలు ఆశించకుండా వస్తే మాత్రమే చేర్చుకోవాలని కూడా సూచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో లేచి చూడాలి.