కోర్టు అనుమతి ఎక్స్పైర్ అవుతుందా ?

జగన్మోహన్ రెడ్డికి ఒకదాని వెంట ఒకటి వస్తున్న కష్టాలు పగవాడికి కూడా రాకూడదు  అనిపించే విధంగా ఉంటున్నాయి. ఎటూ ముఖ్యమంత్రిగా పదవి కూడా లేదు కాబట్టి సాధారణ ఎమ్మెల్యేనే తప్ప బాధ్యతలు కూడా లేవు కాబట్టి, కనీసం సతీ సమేతంగా యూకే లో చదువుకుంటున్న కూతురి వద్దకు పుట్టినరోజు వేడుకల కోసం వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే, ఆ కోరిక కూడా తీరలేదు! పైగా ఆయన సిబిఐ కోర్టు ద్వారా తెచ్చుకున్న అనుమతి కూడా ఎక్స్పైర్ అయ్యేలా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి యూకే పర్యటనకు వెళ్లాలంటే మరొకసారి సిబిఐ కోర్టు తలుపు తట్టి అనుమతి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఇప్పుడు కనిపిస్తోంది.

క్విడ్ ప్రోకో రూపంలో వందల వేల కోట్ల రూపాయల అవినీతి సంపాదనలకు సంబంధించిన కేసులలో ఏ 1 ముద్దాయి అయిన జగన్మోహన్ రెడ్డి- సీబీఐ కోర్టులో విచారణను ఎదుర్కొంటున్నారు. కాగా ఆయన దేశం విడిచి వెళ్లాలంటే ఆ కోర్టు నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా యూకే పర్యటనకు వెళ్లి వస్తానని, అందుకు అనుమతి కావాలని ఆయన సిబిఐ కోర్టులో దావా వేసుకున్నారు. కొన్ని రోజుల కింద కోర్టు అందుకు అనుమతి కూడా ఇచ్చింది. తీరా ప్రయాణానికి సన్నద్ధం అవుతున్న సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన ఉన్నటువంటి డిప్లమాట్ పాస్ పోర్టు రద్దయిపోయింది. కొత్తగా పాస్ పోర్టు కోసం కూడా అనుమతి చేసుకున్నారు.

గతంలో మంత్రి నారాయణ ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్ మీద ఒక పరువునష్టం కేసు దాఖలు చేసి ఉన్న కారణంగా.. ఆ కోర్టు నుంచి పాస్ పోర్టు కోసం ఎన్వోసీ తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయిదేళ్లకు తన పాస్ పోర్టు కావాలని ఆయన పిటిషన్ వేస్తే, ఒక సంవత్సరం కాలానికి పాస్ పోర్టు తీసుకోవడానికి ప్రజాప్రతినిధుల కోర్టు ఎన్వోసీ ఇచ్చింది. దీనిపై మళ్లీ జగన్ హైకోర్టుకు వెళ్లారు. తనకు అయిదేళ్లు పాస్ పోర్టు ఇచ్చేలా ప్రజాప్రతినిధుల కోర్టును ఆదేశించాలని కోరారు. కేసును తక్షణం విచారించాలని జగన్ కోరుకున్నారు గానీ.. హైకోర్టుదానిని సోమవారానికి వాయిదా వేసింది.

జగన్ కు 3వ తేదీనుంచి 25వ తేదీ వరకు మాత్రమే విదేశాలకు వెళ్లడానికి సీబీఐ కోర్టు అనుమతి ఉంది. ఆ రకంగా కనీసం పిల్లలతో కనీసం 20 రోజులు విదేశాల్లో గడిపేలా ఆయన ప్లాన్ చేసుకున్నారు. ఆయన పాస్ పోర్టు సంగతి సోమవారం హైకోర్టులో తేలే అవకాశం ఉంది. ఒకవేళ పాజిటివ్ తీర్పు వచ్చినా కూడా.. పాస్ పోర్టు జారీ కావడానికి ఇంకో ఒకటిరెండు రోజులు పట్టవచ్చు. అప్పటికి ఆయనకు అనుమతి ఉన్న రోజుల్లో వారానికి పైగా వృథా అవుతుంది. అంతకంటె జాప్యం జరిగినా చెప్పలేం. కోర్టులో కేసు సంగతి తేలకపోతే.. ఏకంగా సీబీఐ కోర్టు ఇచ్చిన గడువు కూడా దాటిపోవచ్చు. అంటే అనుమతి ఎక్స్‌పయిర్ అయ్యే ప్రమాదమూ ఉందన్నమాట. ఈ నేపథ్యంలో జగన్.. తన ట్రిప్ కుదించుకుని వెళ్తారా, లేదా ఈ అనుమతి వాడుకోలేకపోయానని విన్నవించుకుని సీబీఐ కోర్టును మరోసారి అనుమతి అడుగుతారా వేచిచూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories