ఏపీ బీజేపీ ఇలా ఎదగాలనుకుంటోందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విస్తరణ గురించి అంతగా శ్రద్ధ పెడుతున్న వాతావరణం కనిపించడం లేదు. ఎన్నికల తర్వాత వారు ప్రభుత్వంలో భాగం అయ్యారు, ఏపీ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కమలదళం బలం చాలా చాలా పరిమితమే అయినప్పటికీ.. వారు అధికార పార్టీ అనిపించుకోగలిగారు. తర్వాత పరిణామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్న వారిలో కొందరు నాయకులు.. బిజెపిలో చేరడం జరుగుతోంది. వారంతా పార్టీకి ఏమేరకు ఉపయోగపడతారో గానీ.. మొత్తానికి కమదళం బలం కాస్త  పెరుగుతున్నదనే భావన ప్రజల్లో కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే.. ధర్మవరంలో తెదేపా వారి మీద దాడికి దిగడం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సి ఉంది.

ధర్మవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు జమీర్ .. తన అనుచరులతో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరాలని అనుకున్నారు. ధర్మవరం నుంచి ప్రస్తుతం బిజెపి నాయకుడు సత్యకుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. సాధారణంగా నియోజకవర్గాల్లో ఉండే చిన్న స్థాయి నాయకులు.. తమకు ముందు ముందు ఇబ్బందులు లేకుండా ఉండడానికి స్థానికంగా ఎమ్మెల్యే ప్రాపకంలో ఉండాలని కోరుకుంటారు. అందుకే వైసీపీ నాయకుడు జమీర్ కూడా బిజెపిలో చేరాలని అనుకున్నారు. తన చేరికకోసం ధర్మవరంలోని పల్లవి సర్కిల్ వద్ద ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉన్నారు.

ఈ సమయంలో ఆ మార్గంలో వెళుతున్న తెలుగుదేశం వర్గాయుల వాహనాలపై జమీర్ అనుచరులు దాడికి దిగారు. తెదేపా వారికి చెందిన రెండు కార్లు, నాలుగు టూవీలర్స్ ను ధ్వంసం చేశారు. నడి రోడ్డు మీద గొడవ చూసి స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చారు. అయినప్పటికీ.. పోలీసుల ఎదుటే జమీర్ అనుచరులు తెలుగుదేశం వారిమీద దాడికి పాల్పడడం జరిగింది. మిత్రపక్షాలతోనే ఘర్షణలకు, కొట్లాటలకు దిగే ఇలాంటి వాతావరణంతోనే ఏపీలో బిజెపి ఎదగాలని అనుకుంటున్నదా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి విస్తరణ వారు అనుకున్న స్థాయిలో జరగడం లేదు.

పదవుల గురించి ముందుగానే ఆఫర్లు ఇస్తే తప్ప.. కాస్త పేరున్న నాయకులు వారి మొహం చూడడం లేదు. ఇటీవల వైసీపీ నుంచి రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య సంగతి కూడా అంతే. ఆయన రాజీనామా తర్వాత సుదీర్ఘకాలం మిన్నకుండిపోయారు. బిజెపి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడానికి కొన్ని గంటల ముందు ఆ పార్టీలో చేరారు. అంతటి దయనీయ స్థితిలో ఆ పార్టీ ఉంది. తీరా ఇప్పుడు ధర్మవరంలో జమీర్ ‌ను చేర్చుకోవడానికి తెలుగుదేశం వారి మీద దాడికి దిగడం మంచిది కాదని పలువురు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories