ఇదే వ్యవహారం సినిమాల్లో జరిగితే గనుక.. ‘ఆడికి చిప్ దొబ్బింది రా’ అనే డైలాగు వస్తుంది. ఇది రాజకీయరంగం గనుక, పైగా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గనుక అలాంటి డైలాగు అంటే.. నొచ్చుకునే వాళ్లు ఎక్కువగానే ఉండొచ్చు. కానీ, ఒక్క విషయం మాత్రం నిజం. ఆయన బుర్రలో లాజిక్ గురించి ఆలోచించే పార్ట్ ప్రస్తుతం పనిచేయడం లేదు. పనిచేస్తే ఆయన ఇలాంటిమాటలు మాట్లాడారు అని ప్రజలు అనుకుంటున్నారు. విశాఖకు కూటమి ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ ను తీసుకువస్తుండగా.. ప్రభుత్వం చేసిన కృషి, సాధించిన విజయం, గూగుల్ డేటా సెంటర్ ద్వారా జరగగల అభివృద్ధి అన్నీ కలిసి.. తమకు శాశ్వతంగా సమాధి కట్టేస్తాయనే భయం జగన్మోహన్ రెడ్డిలో బీభత్సంగా ఉంది. ఆ భయంతో ఆయన తనకు అలవాటైన అబద్ధాలను వండివార్చడానికి బరితెగిస్తున్నారు. ఇది గూగుల్ డేటా సెంటర్ కానే కాదు.. గతంలో తాను సీఎంగా ఉండగా అదానీతో ఒప్పందం చేసుకున్న అదానీ డేటా సెంటర్ మాత్రమే అని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన బుర్రలో ఎలా లాజిక్ పనిచేయడం లేదో ఇప్పుడు గమనిద్దాం.
జగన్ చెబుతున్న ప్రకారం.. గూగుల్ డేటా సెంటర్ నిర్మాణాలన్నీ అదానీ 87 వేల కోట్ల రూపాయలతో చేపడతారు. అదానీ నిర్మాణాలన్నీ చేసిన తర్వాత.. అందులో అవసరమైన హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, పరికారలు తదితరాలను గూగుల్ నెలకొల్పితే డేటా సెంటర్ ఏర్పాటు అవుతుంది. ఆయన చెబుతున్నది ఇదే. కానీ.. గూగుల్ తో ఒప్పందం చేసుకున్న సమయంలో అదానీ పేరును కూడా ప్రస్తావించకుండా చంద్రబాబు ద్రోహం చేశారని, అదానీ పేరు చెబితే ఆ క్రెడిట్ తనకు దక్కుతుందనేది ఆయన భయం అని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
ఇక్కడ ఓ విషయం ఆలోచిద్దాం. ఒక గ్రామంలో బ్యాంకు ఏర్పాటు అయితే అక్కడి ప్రజలందరూ కోరుకున్నారు. సర్పంచి లాంటి బాధ్యత గల వ్యక్తి బ్యాంకు పెద్దలను సంప్రదించి తమ గ్రామంలో ఒక శాఖ ఏర్పాటుచేయాలని కోరారు. పదేపదే వారిని కలిసి విన్నవించుకున్నారు. సాధారణంగా స్టేట్ బ్యాంక్ వారు.. తమ సొంత భవనాలను పెట్టుకోవడానికి ఇష్టపడరు. అలాంటి పరిస్థితుల్లో బ్యాంకు తగిన భద్రత ప్రమాణాలతో ఎవరైనా ఒక భవనం నిర్మించి ఇస్తే ఓకే అని చెప్పారు. అప్పుడు మరొక పొరుగూరు వ్యక్తి ఆ గ్రామానికి వచ్చి భవనం నిర్మించి.. బ్యాంకుకు ఇచ్చాడు. బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ స్టేట్ బ్యాంకు వారికి థాంక్స్ చెప్పాలా? లేదా, ఆభవనం కట్టి వారికి లీజుకిచ్చిన వ్యక్తికి థాంక్స్ చెప్పాలా?
ఇక్కడ ఇంకొక పాజిబిలిటీ కూడా ఉంది. ఎస్బీఐ వారే భవనం కట్టే పని ఒక కాంట్రాక్టరుకు అప్పగించారని అనుకుందాం. అది వారి సొంత వ్యవహారం. కానీ.. గ్రామ ప్రజలు రుణపడి ఉండాల్సింది ఎవరికి? బ్యాంకుకా? భవనం కట్టిన కాంట్రాక్టరుకా?
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న వంకర మాటలు ఇలాగే కనిపిస్తున్నాయి. జగన్ తన పాలన కాలంలో అదానీతో డేటాసెంటర్ కోసం ఒప్పందం చేసుకుంటే.. ఆయన ఇంతకాలం పెట్టకుండా ఏం చేస్తున్నట్టు? అదే గూగుల్ డేటా సెంటర్ అయితే గనుక.. ఇప్పుడు సుందర్ పిచాయ్ ప్రకటించినట్టుగా అప్పట్లో ప్రకటన ఎందుకు రాలేదు? ఒకవేళ అదానీ, ఇప్పుడు గూగుల్ పెట్టబోతున్న డేటా సెంటర్ భవనాల్ని కట్టించి ఇచ్చినా కూడా.. దానిని అదానీ డేటా సెంటర్ అంటారా? గూగుల్ డేటా సెంటర్ అంటారా? అనేవి ప్రజల సందేహాలుగా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు, కూటమి ప్రభుత్వానికి చంద్రబాబునాయుడు, లోకేష్ లకు వస్తున్న క్రెడిట్ చూసి ఓర్వలేక, మరీ అంత బుర్రలేకుండా మాట్లాడితే ఎలా అని ప్రజలు అనుకుంటున్నారు.

