ఒక మతానికి చెందిన వాళ్లు మరొక మతం ఆలయాలకు, ప్రార్ధనా స్థలాలకు వెళ్లడం అనేది తప్పు కాదు. కానీ, ఏ ఆలయానికి, ప్రార్థనా మందిరానికి వెళుతున్నారో అక్కడి నిబంధనలను పాటించడం మాత్రం మన విధి. వారి మతానికి, వారి ఆలయానికి సంబంధించి.. వారు ఎలాంటి నిబంధనలైనా పెట్టుకోవచ్చు గాక.. ఆ నిబంధనలను గౌరవించేటట్లయితే మనం ఆ గుడికి వెళ్ళాలి. లేదా, ఆ గుడికి దూరంగా ఉండాలి. అంతేతప్ప నిబంధనలు పెట్టేట్లయితే మీ గుడిలో ఉన్న వాడు అసలు దేవుడు ఎందుకు అవుతాడు? అన్నట్టుగా అడ్డగోలు చిత్రమైన ప్రశ్నలు సంధించకూడదు! ఈ విషయంలో అర్థం లేని దూకుడు ప్రదర్శిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరికి చెంపపెట్టు లాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ బృందం వ్యవహరించడం విశేషం. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బృందంలో ఒక అన్యమతస్తులు పాటించిన నియమాల స్ఫూర్తిని జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోగలరా.. ఆయనకు అంత సదవగాహన శక్తి ఉన్నదా అనేది ఇప్పుడు ప్రజలలో చర్చ జరుగుతోంది.
సిజెఐ చంద్రుచూడ్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన బృందంలో ఒక ఇతర మతానికి చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన ఎలాంటి అభ్యంతరమూ వ్యక్తం చేయకుండా తిరుమల తిరుపతి దేవస్థానాల నిబంధన ప్రకారం డిక్లరేషన్ ఫారం సమర్పించి స్వామిని దర్శించుకున్నారు.
లడ్డు తయారీకి కల్తీ నెయ్యి అందించేలా చేసిన పాపం గురించి.. తలా తోకాలేని తన సమర్ధింపు మాటలు చెప్పాలని అనుకున్నారో, లేదా ఆ పాపానికి ప్రాయశ్చిత్తం, పరిహారం కోసం దేవుడిని దర్శించుకోవాలనుకున్నారో తెలియదు కానీ.. జగన్ మోహన్ రెడ్డి కూడా తిరుమల దైవ దర్శనానికి షెడ్యూలు చేసుకున్నారు. అయితే ఆయన క్రిస్టియన్ కావడం వలన డిక్లరేషన్ ఫారం పై సంతకం పెడితే తప్ప అనుమతించేది లేదని టిటిడి చెప్పండంతో ఆయన తన దైవదర్శనాన్ని రద్దు చేసుకున్నారు. ఈ చర్య గమనిస్తే ఇంతకు ఆయన అసలు దేవుడు కోసం వెళ్లదలచుకున్నారా? కేవలం తన పంతం కోసం వెళ్లదలుచుకున్నారా? అనేది మనకు అర్థమైపోతుంది. దేవుడు ఆయనకు ప్రయారిటీ అయితే, ఆ దేవుడు కోసం డిక్లరేషన్ సంతకం కాదు కదా మరే ఇతర పని చేయమన్నా సరే చేసి గానీ వెళ్ళరు.
పైగా జగన్మోహన్ రెడ్డి నన్ను డిక్లరేషన్ అడుగుతారా అంటూ దబాయిస్తున్నారు. ఒక సాధారణ ఎమ్మెల్యే తానేదో మహాశక్తిమంతుడిని, మహామహుడిని, మహాదేవుడిని అన్నట్టుగా భావించుకుంటూ.. అడిగే నిర్ణయాన్ని తప్పు పట్టడం అనేది తీవ్రమైన సంగతి. జగన్మోహన్ రెడ్డి లాంటి మత అతివాదులకు బుద్ధి వచ్చేలాగా చీఫ్ జస్టిస్ బృందంలోని వ్యక్తి సంతకాలు చేయడాన్ని మనం గమనించాలి పదవి హోదాలలో వాళ్ళు చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా వారు అందించిన స్ఫూర్తి తాను తీసుకోవాలని జగన్ భావిస్తే కనుక ఆయనకు భవిష్యత్తు కూడా ఉంటుంది. లేకపోతే కష్టం!