సుప్రీం తీర్పులో ప్రమాదం జగన్‌కు అర్థం కాలేదా?

తిరుమల వేంకటేశ్వరస్వామివారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించి నెయ్యి కల్తీ విషయంలో సుప్రీం కోర్టు తన కీలకమైన తీర్పును వెలువరించింది. ఈ వ్యవహారం గురించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి అయిదుగురు సభ్యుల స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే తమాషా ఏంటంటే.. సుప్రీం తీర్పు వెలువడిన వెంటనే.. జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి.. ‘సుప్రీం తీర్పుతో ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడుకు బుద్ధి వచ్చినట్లు అయిందని’ వ్యాఖ్యానించడం! తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేయడం!! ఆయన పోకడ గమనించిన ప్రజలు మాత్రం.. అసలు జగన్మోహన్ రెడ్డికి సుప్రీం తీర్పు సారాంశం గానీ, ఆ తీర్పు వలన ఆయన పార్టీకి పొంచి ఉన్న ప్రమాదం గానీ అర్థమైందా? అని ప్రశ్నిస్తున్నారు.
సుప్రీం తీర్పుకారణంగా.. ఇప్పటికే ఈ విషయంలో దర్యాప్తు నిమిత్తం రాష్ట్రప్రభుత్వం నియమించిన సిట్ అనేది రద్దయినందుకు జగన్ సంతోషిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీనిని చంద్రబాబుకు తగిలిన ఎదురుదెబ్బలాగా ఆయన అభివర్ణిస్తున్నారు. నెయ్యి కల్తీ వ్యవహారం వెలుగుచూశాక.. సుప్రీంలో ఎవరో వేసిన పిటిషన్లపై తీర్పు వచ్చేదాకా రాష్ట్రప్రభుత్వం అచేతనంగా చేష్టలుడిగి ఉండడం సాధ్యం కాదు కదా..? తన కనీస బాధ్యతగా చంద్రబాబు సిట్ ఏర్పాటుచేశారు. వారు మూడురోజులపాటు విచారణ కూడా చేశారు. ఈలోగా సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆ సిట్ విచారణను డీజీపీ ఆపుచేయించారు. ఆ సిట్ అధికారులు తాము రాబట్టిన వివరాలను డీజీపీకి సమర్పించారు కూడా. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ కాదని, సీబీఐ అధికారుల్ని కూడా ఇద్దరిని చేర్చి, సీబీఐ డైరెక్టర్ ఆధ్వర్యంలోనే పనిచేసేలా.. కొత్త సిట్ ఏర్పాటుకు సుప్రీం కోర్టు సూచన చేసింది. జగన్ ఈ తీర్పుతో ఎందుకు మురిసిపోతున్నారో తెలీదుగానీ.. దీనివల్ల ఆయన ఒక ఎడ్వాంటేజీని కోల్పోయారని  ప్రజలు అంటున్నారు.
చంద్రబాబు ఏర్పాటుచేసిన సిట్ పనిచేసి నివేదిక ఇచ్చి ఉన్నట్లయితే.. కనీసం అది ఏకపక్షంగా చంద్రబాబు ఆదేశాల మేరకే నివేదికను తయారుచేశారని ఆరోపణలు చేయడానికైనా జగన్ దళానికి వెసులుబాటు ఉండేది. ఇప్పుడు సీబీఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో పనిచేసేక సిట్ కావడం వలన.. వైసీపీ నేతలకు వ్యతిరేకంగా నివేదిక వచ్చినా కూడా.. చంద్రబాబును నిందించడానికి జగన్ కు అవకాశం లేదు. రాష్ట్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమే గనుక, ఇప్పటికే రాష్ట్రానికి చెందిన బిజెపి కేంద్రమంత్రి కూడా.. జగన్ ప్రభుత్వం హయాంలో తిరుమలలో అరాచకాలు జరిగాయని వ్యాఖ్యానించిన మాటలను బట్టి.. సిట్ నివేదికకు బిజెపికి ముడిపెట్టి విమర్శలు చేయడానికి జగన్ కు ధైర్యం చాలదు. ఆ రకంగా నివేదిక తర్వాత కూడా చంద్రబాబు మీద బురద చల్లగల అవకాశాన్ని జగన్ కోల్పోయారు. ఆ సంగతి అర్థమైందో లేదో గానీ.. ఆయన ఈ తీర్పుపై సంతోషం వ్యక్తం చేయడం చిత్రంగా కనిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories