విశాఖ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది. ఆగస్టు 30వ తేదీన ఉప ఎన్నిక జరుగుతుంది. సెప్టెంబరు 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ లాంఛనమైన ప్రక్రియ సంగతి పక్కన పెడితే.. మొత్తం 815 ఓట్లున్న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీకి 615 ఓట్ల బలం ఉంది. చెదురుమదురుగా కొందరు అధికార కూటమిలోకి ఫిరాయిస్తారని అనుకున్నప్పటికీ.. గెలుపు వైసీపీదే అనే ధీమా వారిలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో వారు తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని మోహరిస్తారనే సంగతి ఆసక్తికరంగా మారుతోంది. పార్టీ వర్గాల ద్వారా వినిపిస్తున్న పేర్లను గమనిస్తే.. ప్రజలు తిరస్కరించిన వాళ్లకే జగన్ మళ్లీ పెద్దపీట వేస్తారా? అనే అభిప్రాయాలు పలువురిలో కలుగుతున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఎమ్మెల్సీ అయిన వంశీకృష్ణ శ్రీనివాస్, ఈ ఎన్నికలకు ముందు జనసేనలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ ఫిర్యాదుతో ఆయనను అనర్హుడిగా ప్రకటించాక, ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. బలం ఉంది గనుక.. గెలిచి తీరుతాం అని వారు అనుకోలేకపోతున్నారు. తెలుగుదేశం ఎందరిని తమ పార్టీలోకి ఆకర్షిస్తుందో అనే భయం వారిలో ఉంది.
కీలక అంశం ఏంటంటే.. తెలుగుదేశం ఎన్నికలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా గండి బాబ్జీని పోటీచేయించాలని అనుకుంటోంది. వైసీపీ మాత్రం గుడివాడ అమర్నాథ్ ను గానీ, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడును గానీ పోటీచేయించాలని అనుకుంటోందిట. జగన్ ఆలోచనపై ఆయన సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన వాళ్లనే మళ్లీ చట్టసభలకు పంపాలనే జగన్ వైఖరి వారికి మింగుడు పడడం లేదా? పార్టీలో ఇంకెవ్వరికీ అవకాశం ఇవ్వరా? పార్టీకి నాయకుల కొరత ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ప పార్టీకి నాయకులకే గతి లేనట్టుగా ఓడిపోయిన వాళ్లను ఎమ్మెల్సీలుగా పంపాలనుకోవడం మంచి ఆలోచన కాదంటున్నారు.
జగన్ వైఖరి పార్టీ నాయకులకు అవమానకరంగా ఉంటోంది. ప్రజలు తిరస్కరించిన వారి మీద మాత్రమే జగన్ కు అంత ప్రేమ పొంగిపోతూ ఉంటే.. వారికి పార్టీ బాధ్యతలు అప్పగించవచ్చునని.. మళ్లీ ప్రజాప్రతినిధులుగా కూర్చోబెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో తిరస్కారం.. జగన్ ఆలోచనల్లో మార్పు తెస్తుందో లేదో చూడాలి.