పరువు గురించి మాట్లాడే హక్కు జగన్ కు ఉందా?

ఒక వ్యక్తి యొక్క ‘పరువు’ గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నదా అనేది ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత హాట్ టాపిక్. తాను అధికారంలో ఉండగా.. న్యాయవాదులను కూడా దిక్కులేని, బతుకుతెరువులేని వర్గం కింద పరిగణించినట్లుగా జగన్మోహన్ రెడ్డి వారికి కూడా పింఛన్లు  వంటి ఆర్థిక సాయం అందించారు. నిజానికి ముసలితనంలో పేదరికంలో ఉన్న వారికి, భర్తను కోల్పోయి జీవితం భారంగా మారిన వారికి, వికలాంగులకు పెన్షన్లు ఇచ్చినట్టుగా న్యాయవాదులకు కూడా ఆర్థిక సాయం తీసుకువచ్చారు జగన్. తన పాలనకాలంలో అలాంటి ప్రయోజనం పొందిన న్యాయవాదుల్లో కొందరితో తాడేపల్లి ప్యాలెస్ లో ఓ సమావేశం పెట్టుకున్నారు. ఆ సమావేశంలో అనేక ధర్మపన్నాలు ప్రవచించారు. వాటిలో ఇది కూడా ముఖ్యమైనది. ‘ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే ఆ వ్యక్తి పరువు ప్రతిష్ఠలతో ఆడుకోవడమే’నట! ‘తమకు కిట్టని వారు, నచ్చని వారు, ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపించే వారిపైన దొంగ సాక్ష్యాలు సృష్టించి కేసులు పెడుతున్నారట. జైలుకు పంపి వారి పరువు తీస్తున్నారట.ఒక కేసులో బెయిలు వచ్చి బయటకు వచ్చేలోగా.. మరో కేసు పెట్టి వారిని జైల్లోనే పెట్టేస్తున్నారట. అందువల్ల వారి పరువు ప్రతిష్ఠలు పోతున్నాయట.’ ఇదీ జగన్ చెప్పుకొచ్చిన మాట.
దాదాపు లక్ష కోట్ల రూపాయల అవినీతి, క్విడ్ ప్రోకో దందాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లారు. కొన్ని నెలలపాటు ఆయన జైల్లోనే ఉన్నారు. ఆయన పరువు, ప్రతిష్ఠలు ఏమైనా దెబ్బతిన్నాయని ఆయన అనుకుంటున్నారా? బయటకు వచ్చిన తర్వాత.. ఆయన తన పరువు పోయిఉంటే, పార్టీని ఎలా నడిపారు. ఆ పార్టీని ఎలా అధికారంలోకి తీసుకువచ్చారు. ఇవన్నీ ప్రశ్నలే కదా.

అరెస్టు చేయగానే నాయకుడి పరువు పోతుందని జగన్ అంటున్న మాటలు కామెడీ ఉన్నాయి. ఎందుకంటే.. నిజంగా రాజకీయ కక్ష సాధింపు అరెస్టులే అయితే గనుక.. వారి పరువుకు భంగం కలగదు. చంద్రబాబును కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్టు చేయించి జైల్లో పెట్టించారు. రకరకాలుగా వేధించారు. ఆయన పరువు తీయగలిగాననే జగన్ నమ్ముతున్నారా? ఆయన పరువు ప్రతిష్ఠలు ఆ అరెస్టు వల్ల మంటగలిసిపోయి ఉంటే గనుక.. బయటకు వచ్చిన తర్వాత.. చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి ఎలా అయ్యారు.. అనేది పెద్ద ప్రశ్న.
పాయింట్ ఏంటంటే.. అరెస్టు అయిన నాయకులు దుర్మార్గులు, దోపిడీ దొంగలు, అవినీతి పరులు కాకపోతే.. నిజాయితీపరులే అయితే.. కుట్రపూరితంగా అరెస్టు అయితే.. వారు బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రజలు వారిని నెత్తిన పెట్టుకుంటారు. మళ్లీ తమ నాయకుడిగా ఎన్నుకుంటారు. కాబట్టి అరెస్టుల వల్ల పరువు పోతుందనే వాదనలో నిజం లేదు. అయినా జగన్మోహన్ రెడ్డితో అంటకాగుతూ.. ఆయన కళ్లలో ఆనందం చూడడం కోసం తప్పుడు పనులు చేయడం ప్రారంభించినప్పుడే.. వారి పరువు పోయినట్టు లెక్క. పరువు గురించిన అసలు విషయం జగన్ గుర్తించడం లేదు. జగన్ అనుచరులు కూడా ఆ సంగతి గ్రహిస్తే.. ఆయన నీడనుంచి నెమ్మదిగా బయటపడతారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories