మోడీని ధిక్కరించే ధైర్యం జగన్‌కు ఉందా?

జగన్మోహన్ రెడ్డి ఎంత స్థిరచిత్తంతో, ధైర్యంతో ఉండగలరో తేలిపోయే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. కేంద్రప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన వివాదాస్పద వక్ఫ్ ఆస్తుల చట్ట సవరణ బిల్లు.. రాజ్యసభలో గండం గడిచి గట్టెక్కాలంటే.. వారికి ఇతరుల మద్దతు కూడా తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభ ఎదుటకు వచ్చినప్పుడు అమిత్ షా- జగన్మోహన్ రెడ్డికి ఫోను చేసి సహకారం కోరడం తప్పకుండా జరుగుతుంది. అయితే ఏపీలోని ప్రస్తుత రాజకీయ వాతావరణం నేపథ్యంలో మోడీ సర్కారు గట్టెక్కడానికి, జగన్ సహకరిస్తారా? లేదా, మొహం చాటేసి మోడీ సర్కారు ఓడిపోయేలా చేస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.
వక్ఫ్ ఆస్తుల సవరణకు సంబంధించిన బిల్లు ఇప్పుడు చట్టరూపం దాల్చాలి. ఇప్పటికే దేశంలోని ముస్లిం మైనారిటీ సంఘాలు అనేకం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. వక్ఫ్ బిల్లును అసలు అనుమతించకుండా కేంద్రం మీద ఒత్తిడి తేవాలంటూ.. ఇతర పార్టీలు అందరినీ కలిసి మైనారిటీ సంఘాలు కోరుతున్నాయి. ఎన్డీయేలోని పార్టీలను కూడా కొందరు మైనారిటీ నాయకులు కలిసి వక్ఫ్ బిల్లు ఆమోదం పొందకుండా చూడాలని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లి ఉంది. ఆ పర్వంపూర్తయిన తర్వాత.. లోక్ సభలో బిల్లు నెగ్గడం అనేది మోడీ సర్కారుకు చాలా సునాయాసమైన సంగతి. అయితే రాజ్యసభలో గట్టెక్కే పరిస్థితి లేదు.

మొత్తం 245 మంది సభ్యులు ఉండే రాజ్యసభలో జమ్మూకాశ్మీర్ ఖాళీలు 4, ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలు జరగవలసి ఉన్న ఖాళీలు 12 తొలగిస్తే.. మొత్తం 229 స్థానాలు మాత్రమే ఉంటాయి. అంటే ఈ వక్ఫ్ బిల్లు రాజ్యసభలో నెగ్గాలంటే 115 ఓట్లు కావాలి. కానీ ఎన్డీయే కూటమికి ఉన్న 105 సీట్లు, నియమితులైన ఎంపీల 6 ఓట్లు కలుపుకుంటే 111 వరకు వారి బలం చేరుతుంది. ఇంకా 4 ఓట్లు కావాల్సి ఉంటుంది. అంటే ఎన్డీయేతర పక్షాలు ఎవరైనా సహకరించాలి.

ఆ కేటగిరీలో ఉన్నది వైసీపీ- 11 సీట్లు, బిజద 8 సీట్లు మాత్రమే. మరి జగన్ గతంలో ప్రతి సందర్భంలోనూ కేంద్రం అడిగినప్పుడెల్లా రాజ్యసభలో తమ పార్టీ వారితో కేంద్రం బిల్లులకు అనుకూలంగా ఓట్లు వేయించి సహకరించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వమే ఉంది. కేంద్ర సర్కారులో చంద్రబాబు కూడా భాగస్వామి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా గతంలో అందించిన సహకారాన్ని కొనసాగిస్తారా? అనేది సందేహం. గతంలో మోడీ కళ్లలో ఆనందం చూడడానికి తోడ్పడిన జగన్, ఇప్పుడు కూడా అదే వైఖరితో ఉంటారా? అనేది చర్చనీయాంశంగా ఉంది. మోడీని ధిక్కరించగల  ధైర్యం జగన్ కు ఉన్నదో లేదో తేలడానికి ఇది మంచి తరుణం అని పలువురు భావిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories