ప్రజల అభిప్రాయాలకు విలువ ఇస్తున్నట్లుగా కనిపించడానికి, పార్టీ పునర్నిర్మాణం మీద శ్రద్ధ పెడుతున్నట్లుగా కనిపించడానికి జగన్మోహన్ రెడ్డి తాపత్రయపడుతున్నారు. అందుకోసమే పార్టీ కమిటీల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివాదాస్పదంగా మారిన వ్యక్తులకు తన పార్టీలో చోటు లేదు అనే సంకేతాలను ఆయన ప్రజల్లోకి పంపదలచుకున్నారు. అందుకే దువ్వాడ శ్రీనివాస్ ను పదవి నుంచి తప్పించారు. ఆయన అక్రమ సంబంధం వ్యవహారం రచ్చకెక్కిన తర్వాత పార్టీ పరువు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఈ చర్యలు చేపడుతున్నారు.
అయితే ఇలాంటి క్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ విసిరిన సవాలును స్వీకరించే ధైర్యం.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్నదా అనేది ప్రజల్లో కలుగుతున్న సందేహం. దళితుల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించిన, ఆ సంగతి నిరూపణ కూడా ఆయన తన సొంత పార్టీ నాయకుల మీద జగన్ చర్య తీసుకోగలరా అని డొక్కా ప్రశ్నిస్తున్నారు. దళితుడైన తన కారు డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును ఇంకా నెత్తిన పెట్టుకుని ఊరేగుతూ ఉండడం జగన్ ధోరణికి నిదర్శనం అని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపిస్తున్నారు. దళితులకు శిరోమండనం కేసులో కోర్టు శిక్ష వేసిన తర్వాత కూడా తోట త్రిమూర్తులు మీద పార్టీ పరంగా కనీస చర్య లేకపోవడం అనేది వైయస్సార్ కాంగ్రెస్ లోని పెత్తందారీ పోకడలకు నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు కేవలం దళిత డ్రైవర్ను హత్య చేయడం మాత్రమే కాదు.. తన అసభ్య కార్యకలాపాల వీడియోలతో కూడా మరోసారి వార్తల్లో సంచలనంగా మారారు.
నిజం చెప్పాలంటే దువ్వాడ శ్రీనివాస్ కారణంగా పోయిన పార్టీ పరువు కంటే.. ఎమ్మెల్సీ అనంత బాబు కారణంగా పోయిన పరువే ఎక్కువ. అయితే తనకు ఎంతో ఆత్మీయుడైన అనంత బాబు మీద చర్య తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి మనసు రావడంలేదని డొక్కా ఆరోపిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అనంతబాబు అసభ్య బూతు వ్యవహారాలపై త్వరలోనే గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి ఫిర్యాదు కూడా చేయబోతున్నట్లు ఆయన వివరిస్తున్నారు. చూడబోతే.. అనంత బాబు రూపేణా పార్టీ పరువు సమూలంగా నాశనమయ్యే వరకు జగన్మోహన్ రెడ్డిలో కదలిక వచ్చేలాగా కనిపించడం లేదు.