మాజీ ముఖ్యమంత్రి , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్రప్రభుత్వం మాటను జవదాటేంత ధైర్యం ఉందా? మోడీ అవసరం కూడా లేదు.. అమిత్ షా నుంచి ఫోను వస్తే.. ఆయన రిక్వెస్టు రూపంలో చేసే ఆదేశాలకు ఎదురుచెప్పగల ధైర్యం జగన్ కు ఉందా? రాష్ట్రంలో తనను పదవీచ్యుతుడిని చేసిన ఎన్డీయే కూటమి కేంద్రంలో అధికారంలో ఉన్నది గనుక.. వారు ప్రవేశపెట్టే బిల్లులను రెండో ఆలోచన లేకుండా వ్యతిరేకించగల సత్తా, ధైర్యం ఆ నాయకుడికి ఉన్నాయా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
రాజ్యసభలో ఎన్డీయే సర్కారు తొలినుంచి మైనారిటీలోనే ఉంది. అయితే బిల్లులను ప్రవేశపెడుతున్న ప్రతిసారీ వారు ప్రతిపక్షకూటమిలో లేని ఇతర పార్టీల బలం మీద ఆధారపడుతున్నారు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి కూడా మోడీ సర్కారుకు తొలినుంచి రాజ్యసభలో పూర్తి మద్దతు అందిస్తూ వస్తున్నారు. కీలకమైన బిల్లుల సమంలో మాత్రం అమిత్ షా స్వయంగా జగన్ కు ఫోను చేసి మద్దతు అడగడం జరుగుతోంది. చాలా బిల్లుల విషయంలో అడగకుండానే వైసీపీ ఎంపీలు ప్రభుత్వానికి అనుకూల ఓటు వేస్తున్నారు. బిజెపి మంత్రులతో రాసుకు పూసుకు తిరిగే విజయసాయిరెడ్డి వైసీపీకి రాజ్యసభ పక్ష నాయకుడు కావడం కూడా ఒక కారణం.
అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. అదే ఎన్డీయే కూటమి చేతిలోనే జగన్ రాష్ట్రంలో దారుణంగా ఓడిపోయారు. వారు తనకు శత్రువులు గనుక.. కేంద్రంలో కూడా శత్రుత్వాన్ని కొనసాగిస్తారా? అనేది ప్రశ్న!
రాజ్యసభలో మొత్తం స్థానాలు 245 కాగా జమ్మూకాశ్మీరుకు చెందిన 4 ఇప్పట్లో భర్తీ కావు. అంటే 241లో 121 స్థానాల బలం ఎన్డీయేకు కావాలి. త్వరలో 11 స్థానాలకు ఉప ఎన్నికలు, 4 స్థానాల నియామకం జరగాల్సి ఉంది. ఇందులో ఒక్క సీటు మాత్రం కాంగ్రెసుకు దక్కుతుంది. ప్రస్తుతం 101 గా ఉన్న ఎన్డీయే బలం, త్వరలో 111 మరియు నామినేటెడ్ 4 సీట్లకు పెరుగుతుంది. అయినా సరే వారికి బిల్లులు నెగ్గించుకోవడానికి ఇంకా బలం కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడాల్సి వస్తుంది. బిజూ జనతాదళ్ కు కూడా 9మంది ఉన్నారు గానీ.. ఇటీవలి ఒదిశా ఎన్నికల పరిణామాల తర్వాత.. వారు మద్దతిస్తారనుకోవడం భ్రమ. కానీ.. జగన్ కు వేరే గత్యంతరం లేదు. ఎన్డీయే కూటమికి మద్దతివ్వకపోతే.. తన మీద ఉన్న కేసులను సీరియస్ గా దర్యాప్తు చేయిస్తారనే భయం ఆయనకు ఉంది. కేవలం కేసుల భయం కారణంగానే జగన్, గతంలో మోడీ ఎక్కడ కనిపించినా పాద నమస్కారాలు చేస్తూ.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు అడుగులకు మడుగులొత్తుతూ గడిపారనే వాదన ఉంది. ఆయనకు ఇప్పుడు కూడా అది తప్పకపోవచ్చు. మోడీ సర్కారును ధిక్కరించనంతవరకు మాత్రమే జగన్ బెయిలుపై క్షేమంగా బయట తిరగగలరని.. లేకపోతే జైలు తప్పదని పలువురు విశ్లేషిస్తున్నారు.