ప్రతిపక్షం అన్నాక ప్రభుత్వాన్ని విమర్శించడంలో మాత్రమే వారికి మనుగడ ఉంటుందనేది అందిరకీ తెలిసిన సంగతే. అలాగని అర్థం పర్థం లేని విమర్శలతో అదేపనిగా బురదచల్లుతూ ఉంటే వారే భ్రష్టుపట్టిపోతారు. ప్రభుత్వంమీద, పరిపాలన మీద విమర్శ అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి. వారి వ్యవహారసరళిలో లోపాలు ఉంటే వాటిని తెలియజెప్పేదిగా సరిదిద్దేదిగా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి తీరు అలా ఉండదు. ప్రభుత్వం ఏ చిన్న మంచి పనిచేస్తున్నా సరే.. దాని మీద విషం చిమ్మడమే ఆయన ప్రయారిటీగా కినిపస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ అవకాశం గురించి ఆయన తాజా ట్వీట్లు కూడా ఇలాంటి బుద్ధినే చాటిచెబుతున్నాయి.
చంద్రబాబునాయుడును నిందించడానికి జగన్ పార్టీలని మేధావులు ఒక స్క్రిప్టును తయారుచేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ స్క్రిప్టును కంఠతాపట్టేశారు. ఇక అంతే.. పిడుక్కీ బియ్యానికీ ఒకటేమంత్రం అన్న సామెత చందంగా.. రాష్ట్రంలో ఏ పథకం విషయంలో అయినా సరే.. జగన్ అదే స్క్రిప్టు చెబుతుంటారు. ‘చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు.. ఆయన అబద్ధం చెప్పారు.. మోసం చేశారు’’ ఇలాంటి పదాల చుట్టూతానే జగన్ విమర్శలు మొత్తం తిరుగుతూ ఉంటాయి.
తాజాగా మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం విషయంలో కూడా జగన్ ఇలాంటి మాటలే చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట తప్పారని అంటున్నారు. ఈ మాటలు గమనిస్తే.. ఆయనకు ఏమైనా మెమరీ లాస్ ఉన్నదా అని ప్రజలు అనుకుంటున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏం చెప్పారో జగన్ ఓసారి గుర్తు చేసుకోవాలని అంటున్నారు. చంద్రబాబునాయుడు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణం అని ఎన్నికలకు ముందే ప్రకటించారని, ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అంటున్నారని జగన్ చెబుతున్నారు. ఇది ఆయన మెమరీ లాస్ పోకడకు నిదర్శనం. ఎందుకంటే.. చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పింది కేవలం మహిళలకు సొంత జిల్లాలో ఉచిత ప్రయాణ అవకాశం మాత్రమే. రాష్ట్రమంతా ఉచిత ప్రయాణం అని ఎన్నికలకు ముందు ఎన్నడూ చెప్పనేలేదు. కానీ.. జగన్ అబద్ధాలతో, మెమరీలాస్ కారణంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.
ఒక జిల్లాకు మాత్రమే ఉచిత ప్రయాణం అని ప్రకటించినప్పటికీ.. ఆచరణలోకి తెచ్చే సమయానికి మహిళలకు మరింత మేలుచేసే ఉద్దేశంతో మాత్రమే.. రాష్ట్రమంతా ఉచిత ప్రయాణం అందుబాటులోకి తీసుకువచ్చారు. రోజురోజుకూ ఈ స్త్రీశక్తి పథకం పట్ల మహిళల్లో ఆదరణ పెరుగుతుండడం చూసి జగన్ సహించలేకపోతున్నారు. భయపడుతున్నారనేది అర్థమవుతోంది. అలాగే.. చంద్రబాబునాయుడు తాను ఎన్నికలకు ముందు ప్రకటించిన అన్ని సూపర్ సిక్స్ హామీలను 2024 జూన్ నుంచే అమలు చేస్తానని అన్నట్లుగా జగన్ వేస్తున్న నింద కూడా మెమరీలాస్ చిహ్నమే అని అంటున్నారు. అయిదేళ్లపాటు ఉండే అధికారంలో ఒక్కటొక్కటిగా అన్నీ అమలు చేస్తారు కదా అంటున్నారు. జగన్ తన పసలేని విమర్శలతో ప్రజల్లో తానే చులకన అవుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.