కోర్టుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారా.. సజ్జలా?

తనదాకా వచ్చేసరికి తత్వం బోధపడుతున్నట్టుంది సజ్జల రామక్రిష్ణారెడ్డికి. ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి  అరాచక పాలన సాగిన అయిదేళ్ల కాలంలో.. పోలీసు శాఖను తన చెప్పుకింద పెట్టుకుని తనకు కిట్టని వాళ్లందరి మీదకు ప్రయోగిస్తూ వచ్చిన వ్యక్తి సజ్జల రామక్రిష్ణారెడ్డి.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద జరిగిన దాడికేసులో నిందితుడిగా తనను కూడా విచారణకు పిలిచేసరికి ఉడికిపోతున్నారు. ఎగిరెగిరి పడుతున్నారు. విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినందుకే ఆయన ఇంతగా ఎగిరిపడితే.. ఏకంగా అరెస్టు చేస్తే ఇంకెంత యాగీచేస్తారో అని ప్రజలు అనుకుంటున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం వేధిస్తున్నదని, వైఎస్సార్ కాంగ్రెస్ లో కీలకమైన నాయకులు అందరినీ అరెస్టు చేయాలని చూస్తున్నదని సజ్జల ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం ఆఫీసు మీద జరిగిన దాడి చాలా ధర్మ సమ్మతమైనది అని కూడా ఆయన సమర్థిస్తున్నారు. సజ్జల మాటలు చాలా చిత్రంగా ఉంటున్నాయి. తనకు సుప్రీం కోర్టు రక్షణ కల్పించిందని వాదిస్తున్నారు. సుప్రీం కోర్టు అరెస్టు చేయవద్దని అన్నదే తప్ప.. విచారణకు పిలవవద్దని చెప్పలేదు. ఒకవేళ అలా చెప్పిఉంటే.. విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వడంపై ఆయన కోర్టు ధిక్కారణ పిటిషన్ వేసుకోవచ్చు. అప్పుడు ఏపీ పోలీసులే ఇరుక్కుంటారు. ఆయనకు ఆ ధైర్యంలేదు. లేకపోగా, తమకు న్యాయస్థానాల మీద విశ్వాసం ఉన్నదని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

జగన్ దళాలకు న్యాయస్థానాలపై ఏమాత్రం నమ్మకం ఉన్నదో ప్రతి ఒక్కరికీ తెలుసు. జగన్ పాలన కాలంలో కోర్టుల్లో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా వారు పట్టించుకోలేదు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చిన చాలా తీర్పులను అసలు పట్టించుకోలేదు. చివరికి అమరావతి విషయంలో నిర్మాణాలను తక్షణం ప్రారంభించాలంటే కూడా పట్టించుకోలేదు. ఇదంతా పక్కన పెడితే.. సజ్జలకు కోర్టు మీద విశ్వాసం ఉంటే కాదన్నది ఎవరు? ఆయనకు ఇచ్చిన నోటీసుల మీద ఆయన చాలా హాయిగా కోర్టుకు వెళ్లవచ్చు కదా.. నోటీసులు ఇచ్చిన పోలీసుల్ని కోర్టుకు లాగవచ్చు కదా? అనేది ప్రజల  సందేహం.

చివరికి తనపై లుకౌట్ నోటీసులు ఇవ్వడాన్ని కూడా రాద్ధాంతం చేస్తున్నారు. తాను విదేశాలకు వెళ్లానని తెలిసే లుకౌట్ నోటీసులు ఇచ్చారట. ఎలా తెలుస్తుంది? ఆయన ఏమైనా పోలీసులకు సమాచారం ఇచ్చి విదేశాలకు వెళ్లారా? అనేది సందేహం. 7వ తేదీ విదేశాలకు వెళితే.. 10వ తేదీన లుకౌట్ నోటీసులు ఇచ్చారట. అది కూడా తప్పేనన్నట్టుగా సజ్జల మాట్లాడుతున్నారు.

ఆయన చెబుతున్నట్టుగా ఇవి బేస్ లేని కేసులో అవునో కాదో విచారణకు వెళితే తెలుస్తుంది. ఆయన పాత్ర తేలితే అరదండాలు పడతాయి. పాత్ర లేదని తేలితే హాయిగా బయటకు వచ్చి పోలీసులను మళ్లీ విమర్శించవచ్చు. అంతే తప్ప, నోటీసులకే జడుసుకుని అందరినీ తిట్టిపోయడం మాత్రం చాలా హేయంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories