కొడాలి గుడిని మింగేసినా చోద్యం చూస్తుంటారా?

వడ్డించేవాడు మనవాడైతే పంక్తి చివర్న కూర్చున్నా ఇబ్బంది లేదని సామెత! అలాగే అధికారంలో ఉన్నవాడు మనవాడైతే.. గుడి ఆస్తులను దిగమింగేసినా అడిగే నాధుడు ఉండడు అనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరూపిస్తున్న తాజా సామెత.  గుడివాడలో రెండు దేవాదాయాలకు సంబంధించిన భూములను కాజేయడానికి కొందరు కలిసి ముఠాగా ప్రయత్నిస్తే.. ఆ ప్రయత్నాలు అడ్డుకోవడానికి కూడా గత సర్కారు ప్రయత్నించకపోవడం ఇప్పుడు బయటకు వస్తోంది. ట్రైబ్యునల్ లో స్వాహారాయుళ్లకు అనుకూలంగా తీర్పువచ్చాక కనీసం హైకోర్టులో అప్పీలు చేయకుండా.. దేవాదాయ శాఖ అధికారులు జాప్యం చేయడం కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడివల్లనే అనేది వెలుగులోకి వస్తోంది.

ఇంతకూ అసలు కీలకం ఏంటంటే.. దాదాపు 75 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఈ ఆలయ భూముల స్వాహా పర్వంలో అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని కూడా ఒక కీలక పాత్రధారి. ఆయన ఫ్యామిలీ ప్యాకేజీగా తన తమ్ముడు, తల్లిపేర్ల మీద కూడా కలిపి గుడి ఆస్తులు మింగేయాలని చూశారు. అలాంటి పెద్దతలకాయలు కబ్జారాయుళ్లజాబితాలో ఉండడంతో.. అధికారులు అప్పీలుకు కూడా సాహసించలేదు. తీరా ఇప్పుడు కూటమిప్రభుత్వం వచ్చాక దాఖలు చేశారు.

గుడివాడలో భీమేశ్వరస్వామి, వేణుగోపాల స్వామి ఆలయాలు ఉన్నాయి. పట్టణ శివార్లలో ఈ రెండు ఆలయాలకు 75 ఎకరాల దాకా భూములున్నాయి. ఆ భూములను అప్పట్లో ఆలయాల్లో నృత్యాలు చేసే దేవదాసీ లకు రాసి ఇచ్చారు. దేవదాసీ వ్యవస్థను ప్రభుత్వం రద్దుచేసిన తర్వాత.. ఆ భూములు తిరిగి దేవాలయాల పరం అయ్యాయి. అయినా వాటిని పట్టించుకునే దిక్కులేక రకరకాలుగా చేతులు మారినట్టు రికార్డులు తయారయ్యాయి. కానీ.. 2017లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఉండగా.. ఆ భూములను ఆలయ ఆస్తుల రిజిస్టర్ లో నమోదుచేసి.. నిషేధిత జాబితాలో చేర్చారు.

చంద్రబాబు నాయుడు సర్కారు వాటిని కాపాడడానికి ప్రయత్నిస్తే కొడాలి అండ్ కో కాజేయడానికి పెద్ద ఎత్తుగడ వేశారు.  తమ దగ్గర పత్రాలు ఉన్నాయని, విక్రయాలకు ఎన్వోసీ ఇవ్వాలని అడిగారు. వైసీపీ ఒత్తిడులకు కాస్త మొగ్గినప్పటికీ.. చివరకు అధికారులు ఎన్వోసీ ఇవ్వడానికి నిరాకరించారు. కొడాలి అండ్ కో ట్రిబ్యునల్ కు వెళ్లి తమకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు. మూడు నెలల్లోగా హైకోర్టులో అప్పీలు చేయాల్సిన దేవాదాయ అధికారులు ఆ పనిచేయకుండా కొడాలి కుట్రలకు కొమ్ముకాశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ఈ వ్యవహారాన్ని మళ్లీ తవ్వి తీశారు. ఆక్రమణల ఏరివేతకు కృతనిశ్చయంతో ఉన్నట్టుగా ఒకవైపు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెబుతుండగా.. అధికారులు ఇప్పుడు హైకోర్టులో అప్పీలు చేయడం విశేషం. ప్రభుత్వం మారకపోయి ఉంటే గనుక, కొడాలి ఫ్యామిలీ గుడి ఆస్తులనే కాకుండా గుడిని మింగేసినా కూడా అధికారులు చోద్యం చూస్తూ ఉంటారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories