టాలీవుడ్ యువ సామ్రాట్, కింగ్ అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని నాగచైతన్య.. కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. చైతుకి ఆటో మొబైల్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కారు రేసింగ్స్ అన్నా, ఫార్ములా వన్ అన్నా చాలా చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో తెలియజేశారు. అలాగే ఆయన ఇప్పుడు తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్ కార్లను, మోటార్ సైకిల్స్‌ను కూడా సేకరిస్తుంటారు.
అలాంటి ఇష్టమైన రంగంలోకి చైతన్య అడుగు పెట్టారు . ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్)లో పోటీ పడే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని చైతూ కొనుగోలు చేసి సొంతం చేసుకున్నాడు. దీని వల్ల ఆయన ఐఆర్ఎఫ్ నిర్వహించే ఫార్ములా 4లో భాగం కూడా అయ్యారు. ఈ రేసులు ఆగస్ట్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్బంగా అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ ‘‘నాకు చిన్నతనం నుంచి కూడా మోటార్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఫార్మాలా వన్‌ను ఎంతగానో ప్రేమిస్తాను. ఫార్ములా వన్‌లోని హైస్పీడ్ డ్రామా, వేగంగా కార్లు, బైక్స్ నడపటంలోని థ్రిల్ నన్ను సర్‌ప్రైజ్ చేస్తుందన్నారు.
ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ నాకు కాంపిటేషన్ కంటే ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. నా ఫ్యాషన్‌ను చూపించుకునే చక్కటి వేదిక ఇదని నేను భావిస్తున్నాను. ఈ క్రమంలోనే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్‌ను సొంతం చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఫ్యాన్స్‌కు ఐఆర్ఎఫ్ అనేది మరచిపోలేని అనుభూతినిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే దీంతో ఇండియన్ మోటార్ స్పోర్ట్స్ నెక్ట్స్ రేంజ్‌కి చేరుకుంటుంది. న్యూ టాలెంట్ బయటకు వస్తుంది’’ అని అన్నారు.
ఇండియన్ రేసింగ్ లీగ్‌లో పాల్గొంటున్న ఆరు టీమ్స్‌లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ కూడా ఒక టీమ్. ఇందులో నాగచైతన్య భాగం కావటం అనేది స్పీడ్ గేమ్‌కి మరో స్పెషల్ అట్రాక్షన్. ఇంకా ఇందులో అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ కూడా ఇంతకుముందే భాగమైన సంగతి తెలిసిందే. మరోవైపు ఇటీవల సమంత కూడా పికెల్ బాల్ టీమ్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిన విషయమే.