కాదంబరి జత్వానీ మీద అక్రమ కేసులు బనాయించి వేధించిన కేసులో కీలక నిందితుడు, కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు డెహ్రాడూన్ లోని రిసార్ట్స్ లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను ట్రాన్సిట్ వారంటుపై విజయవాడకు తీసుకువచ్చారు. పరారీలో ఉన్న ఆయనను ఇప్పుడు పోలీసులు విచారించనున్నారు. అయితే ఈ విచారణలో విద్యాసాగర్ నిజాలు చెబుతారా? లేదా? అనేది సందేహం. మరో రకంగా చెప్పాలంటే.. ఆయన జాగ్రత్త పడతారా? లేదా, మరింతగా ఊబిలోకి కూరుకు పోవడానికి సిద్ధపడతారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
కాదంబరి జత్వానీని ఏపీ పోలీసులు ఒక రేంజిలో వేధించిన తీరు కేవలం కుక్కల కేసు వలన కాదని, సజ్జన్ జిందాల్ మీద ఆమె పెట్టిన అత్యాచారం కేసు వెనక్కు తీసుకోవడానికి సంబంధించినదేనని ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. ఈ వ్యవహారంలో తనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు.. జిందాల్ తో తమకు అవసరాలు ఉన్న పార్టీలోని మహామహులు తనను ఒక పావుగా వాడుకున్నారు అనే సంగతి కుక్కల విద్యాసాగర్ కు ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి. అదే సమయంలో ఈ కేసు నుంచి అబద్ధాలు చెప్పి తాను తప్పించుకోవడం అసాధ్యం అని కూడా అర్థమై ఉండాలి.
అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలోని సీనియర్లలోనే అనేకమందికి నమ్మకం సడలిపోతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచన కూడా వారికి కలగడం లేదు. ఆ పార్టీలో ఉండడం కంటె, రాజకీయ సన్యాసం బెటర్ అని రాజీనామాలు చేసేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. కుక్కల విద్యాసాగర్ మునిగిపోతున్న నావ వంటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం విచారణలో అబద్ధాలు చెప్పి మరింతగా కూరుకుపోతారా? లేదా, అసలు ఏం జరిగిందో.. పార్టీలోని పెద్దతలకాయలు ఎవరెవరు సూత్రధారులుగా ఉండి తెరవెనుకనుంచి ఈ కథంతా నడిపించారో నిజం చెప్పి బయటపడతారా? అనేది చర్చనీయాంశం.
విద్యాసాగర్ తెరవెనుక సూత్రధారుల గురించి విచారణలో అసలు వాస్తవాలు వెల్లడిస్తే గనుక.. వైసీపీలో భూకంపం పుడుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.