జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆయన బంధుగణం, ఆశ్రితగణం, ఆప్తులు, తొత్తులు ఇలా అందరూ ఎడాపెడా దోచేసుకుంటూ రాష్ట్రాన్ని అథోగతి పాల్జేశారనే విమర్శలు పుష్కలంగా ఉన్నాయి. పైగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయన వర్గీయులు అనుచిత లబ్ధి పొందారనేది ప్రధాన ఆరోపణ. అయితే ఈ దందాల తీరుతెన్నలు నిగ్గు తేల్చాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫునే ఎంపీ గెలిచినప్పటికీ..
తొలినుంచి జగన్ తీరు మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ ఇటీవలే పార్టీకి రాజీనామా కూడా చేసిన రఘురామక్రిష్ణ రాజు హైకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు.ఈ పిటిషన్ విచారణ మరియు శిక్షలు లేదా తీర్పులు అనేది ఇప్పటికిప్పుడు తేలే వ్యవహారం కాకపోవచ్చు గానీ.. మొత్తానికి జగన్ చేసిన పాపాలు ఒక పట్టాన ఆయనను వదలిపోయేలా కనిపించడం లేదు. ఒకవేళ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలైనా సరే.. ఆయన చేసిన పాపాలు మాత్రం వెన్నాడుతూనే ఉంటాయని, వాటి విచారణ అప్పుడు ఇంకా కూలంకషంగా మొదలవుతుందని అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వ నిర్ణయాల మీద సీబీఐ విచారణ కోరుతున్నారు.
నిజానికి రఘురామ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా జరిగిన వాదప్రతివాదాల క్రమం.. జగన్ కోటరీలో ఉన్న భయాన్ని తెలియసేలాగానే సాగాయి. పిటిషన్ రఘురామ.. ఈ పిటిషన్ వేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, అందువల్ల దానిని కొట్టివేయాలని కోరారు. అయితే అలాంటి వాదనే వైసీపీ వారి కొంప ముంచే తీర్పుకు కారణమైంది. వీరి వాదనకు కౌంటర్ గా రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఈ పిల్ వేయనేలేదని, కావాలంటే.. ఎన్నికల వ్యవహారం మొత్తం పూర్తయిన తర్వాతే విచారించినా తనకు అభ్యంతరం లేదని రఘురామ కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ఫలితాలు కూడా వెల్లడయ్యాక, అంటే జూన్ చివరి వారానికి వాయిదా వేసిన హైకోర్టు ధర్మాసనం పెండింగులో పెట్టింది.
ఈ పెండింగులో పెట్టడం వైసీపీ, ప్రభుత్వ న్యాయవాదులకు కొరుకుపడలేదు. ఎందుకంటే.. పెండింగ్ లో ఉంచాల్సిన అవసరం లేనేలేదని ఏజీ శ్రీరాం గానీ, భారతి సిమెంట్స్ తరఫున ఎస్. రవి వాదనలు వినిపించినా కోర్టు తోసిపుచ్చింది. అలాగే ఈ కేసు లోని అంశాల గురించి బయట మాట్లాడకుండా నిరోధించాలని ప్రభుత్వ న్యాయవాది కోరితే కోర్టు తిరస్కరించింది. కేసు పెండింగ్ వ్యవహారం బయట మాట్లాడకూడదని చెప్పగలం తప్ప, కేసులోని అంశాల గురించి మాట్లాడకూడదని చెప్పలేం అని తేల్చేసింది.
అయితే ఇప్పుడు వైసీపీ దళాలలో వణకు పుట్టిస్తున్న సంగతి ఏంటంటే.. ఒకవేళ జగనన్న ఎన్నికల్లో గెలిస్తే పరవాలేదు. కోర్టు ఏం చెప్పినా.. ఖాతరు చేయకుండా రోజులు నెట్టేస్తారు. కానీ జగనన్న ఓడిపోతే.. పరిస్థితి ఏంటి? అధికారంలోకి వచ్చిన వారు కేసులోని జగన్ నిర్ణయాలు అన్నింటినీ తిరగతోడడం ప్రారంభిస్తారు కదా..? ఆ నిర్ణయాల్లో పాపాలు జగన్ ను , ఆయన ద్వారా లబ్ధిపొందిన వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి కదా.. అని ప్రజలు అనుకుంటున్నారు.